ఘనమైన గణతంత్ర్యానికి వెనుక ఏమి జరిగింది?

భారతదేశం సువిశాల సంపన్న దేశం. నాటి నుండి నేటి వరకు భారతదేశ గొప్పదనం ఈ ప్రపంచ వ్యాప్తంగా తెలియనిది కాదు. అయితే భారతదేశం బానిసత్వంలో చిక్కుకుని ఆ తరువాత స్వేచ్ఛ కోసం పోరాడి స్వాతంత్రాన్ని సంపాదించుకుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర్య దినోత్సవం జరుపుకుంటారు. ఈ సంవత్సరం జరుపుకునే గణతంత్ర్య దినోత్సవం 74వది.  దేశం మొత్తం గణతంత్ర్య దినోత్సవం నాడు ఎంతో సందడి నెలకొంటుంది.


అయితే స్వాతంత్య్రానికి గణతంత్ర్య దినోత్సవానికి తేడా ఏమిటనేది చాలా కొద్దిమందికే తెలుసు. గణతంత్ర్య దినోత్సవం భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం జరుపుకుంటారు.  1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సార్వభౌమ గణతంత్ర్య రాజ్యాంగ భారతదేశం అవతరించింది. 1946 డిసెంబర్ 9 వ తేదీన మొదటి సారి రాజ్యాంగ సభ సమావేశం జరిగింది. ఆ తరువాత 1949 నవంబర్ 26 వ తేదీన చివరి సమావేశం జరిగింది. ఆ తరువాత సంవత్సరం ఈ రాజ్యాంగం ఆమోదించబడింది. రాజ్యంగ ముసాయిదా కమిటీకి డా.బి.ఆర్.అంబేద్కర్ నాయకత్వం వహించారు. ఈ రోజునే గణతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు.


1930 జనవరి 26 న భారత జాతీయ కాంగ్రెస్ వలస పాలన నుండి పూర్ణ స్వరాజ్యాన్ని ప్రకటించింది.  భారత పౌరులు తమ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే శక్తిని కూడా గణతంత్ర దినోత్సవం గుర్తుచేస్తుంది. 


రిపబ్లిక్ డే…


భారత రిపబ్లిక్ డే లేదా గణతంత్ర్య దినోత్సవం రోజున జరిగే సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. భారత రాష్ట్రపతి దేశంలోని ఎంపికైన పౌరులకు పద్మ అవార్డులను పంపిణీ చేస్తారు, వీరికి మాత్రమే కాకుండా దేశం కోసం తమ ధైర్యసాహసాలు చాటిన వీర సైనికులకు పరమవీర చక్ర, అశోక్ చక్ర మరియు వీర చక్ర ప్రదానం చేస్తారు. ఇక  రిపబ్లిక్ డే పరేడ్ లో భాగంగా ఎన్నో రకాల విన్యాసాలు జరుగుతాయి. దేశం మొత్తం తమకు లభించిన స్వేచ్ఛను, తమకు రాజ్యాంగ పూర్వకంగా లభించిన హక్కులను చాటి చెబుతూ రిపబ్లిక్ డే ను ఎంతో ఘనంగా జరుపుకుంటుంది.

                                    ◆నిశ్శబ్ద.