పర్పుల్ డే.. మూర్ఛ వ్యాధి ప్రమాదమా?
posted on Mar 25, 2025 9:30AM

మూర్ఛ.. చాలా మందికి పెద్దగా అవగాహన లేని వ్యాధి ఇది. ఈ వ్యాధి బారిన పడేవారు ఆ కుంటుంబానికి తప్ప ఈ జబ్బు గురించి తెలిసిన వారు తక్కువే. నాడీ మండలాన్ని ప్రభావితం చేసే ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది. ఈ మూర్ఛ వ్యాధి గురించి అవగాహన పెంచే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం మార్చి 26వ తేదీన మూర్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ మూర్ఛ దినోత్సవాన్ని పర్పుల్ డే అని కూడా పిలుస్తారు. మూర్ఛ అవగాహనకు మద్దతుగా ఊదా రంగును ధరించమని, ఊదా రంగు రిబ్బన్ ఈ మూర్ఛ వ్యాధిని సూచిస్తుందని చెబుతారు.
నాడీ సంబంధిత పరిస్థితి మూర్ఛ, కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది, దీనివల్ల మూర్ఛ మాత్రమే కాకుండా ఇతర లక్షణాలు కనిపిస్తాయి. మూర్ఛ కారణం, రకాన్ని బట్టి దీని చికిత్స మారుతుంది. మూర్ఛ వ్యాధికి అసలు కారణాలు ఏంటి? దీని నివారణకు ఏం చేయాలి? తెలుసుకుంటే..
మూర్చకు కారణాలు..
ప్రమాదవశాత్తు మెదడు గాయం కావడం వల్ల మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
జన్యుపరంగా కొందరిలో మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఎవరికైనా వంశ పారంపర్యంగా మూర్ఛ వస్తూ ఉంటే ముందు జాగ్రత్తగా చిన్నతనంలోనే వైద్యులను సంప్రదించాలి.
జీవక్రియ లోపాలు ఉన్నవారిలో మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో, రోగ నిరోధక శక్తికి సంబంధించి ఏవైనా అనారోగ్యాలు ఉండే వారిలో మూర్ఛ వ్యాధి తొందరగా వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఇన్ఫెక్షన్ల ద్వారా కూడా మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న దాదాపు 70 శాతం మంది మందులతో తమ మూర్ఛలను నియంత్రించుకుంటారు. మూర్ఛ ఉన్న వ్యక్తులు ప్రమాదాలకు ఎక్కువగా గురవుతారు. ముఖ్యంగా మూర్ఛలు హెచ్చరిక లేకుండా వస్తుంటాయి. దీనివల్ల ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఉబ్బసం లేదా మధుమేహం వంటి ఇతర దీర్ఘకాలిక సమస్యల మాదిరిగానే మూర్ఛ కూడా కొన్ని ప్రమాదాలతో వస్తుంది. వీటిని అదుపు చేయకుండా వదిలేస్తే చాలా తీవ్రంగా మారవచ్చు. మూర్ఛ సంబంధిత ప్రమాదాలను తగ్గించడంలో మూర్ఛ నియంత్రణ మొదటి అడుగు.
మూర్ఛలు కొన్నిసార్లు గాయాలు లేదా పడిపోవడానికి దారితీయవచ్చు. అవి అప్పుడప్పుడు మరింత తీవ్రంగా మరణానికి కూడా కారణమవుతాయి. వివిధ రకాల మూర్ఛలు వేర్వేరు ప్రమాదాలను కలిగి ఉంటాయి.
వచ్చే మూర్ఛల రకం, జీవనశైలిపై ప్రమాద స్థాయి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సరిగా నియంత్రించబడని టానిక్-క్లోనిక్ మూర్ఛలు అత్యధిక ప్రమాదాన్ని కలిగిస్తాయి.
మూర్చ సమస్య ఉంటే ఎప్పుడూ ప్రమాదం ఉంటుందని లేదు. కానీ వైద్యులను సంప్రదించి మూర్చ వ్యాధికి తగిన చికిత్స, జాగ్రత్తలు, నియంత్రణ తీసుకుంటే సాధారణ వ్యక్తులలా జీవితాన్ని గడపవచ్చు.
మూర్ఛ వ్యాధికి ప్రథమ చికిత్స..
ప్రశాంతంగా ఉండాలి. మూర్ఛ వచ్చిన వ్యక్తితోనే ఉండాలి. మూర్ఛ వచ్చిన వ్యక్తిని సురక్షితంగా ఉంచాలి. గాయాలు కాకుండా జాగ్రత్త పడాలి.
మూర్ఛ వచ్చిన వారి తల కింద మెత్తని వస్తువును ఉంచాలి. బిగుతుగా ఉన్న దుస్తులను వదులుగా చేయాలి.
.
మూర్ఛ ముగిసిన తర్వాత శరీరంలో వంకర పోయిన అవయవాలను మెల్లిగా వాటి యథా స్థానాలలో ఉంచాలి. వాటి నోటిలో ఆహారం లేదా ద్రవం ఉంటే, వెంటనే వాటిని బయటకు పోయేలా చేయాలి.
మూర్చ్ వచ్చిన వ్యక్తి కోలుకునే వరకు వారికి ధైర్యం చెప్పాలి.వారు ప్రమాదంలో ఉంటే తప్ప వారి నోటిలో ఏమీ పెట్టకూడదు.
మూర్ఛ ఎందుకు వస్తుంది..
మెదడులో విద్యుత్ అవాంతరాలు ఏర్పడటం వల్ల మూర్ఛ వస్తుంది. మూర్చలో వివిధ రకాలు ఉన్నాయి. ఏమి జరుగుతుందో అర్థం కాని వ్యక్తులకు ఇది భయానక పరిస్థితి కావచ్చు. మైగ్రేన్లు, స్ట్రోక్‌లు, అల్జీమర్స్ తర్వాత ఇది నాల్గవ అత్యంత సాధారణ నాడీ సంబంధిత రుగ్మత. మూర్ఛ వచ్చిన తర్వాత వ్యక్తిని వీలైనంత త్వరగా వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లడం మంచిది.
*రూపశ్రీ.