ప్రతిభకు-ప్రవర్తనకు గల సంబంధం తెలుసా?
posted on Sep 4, 2023 9:30AM
వర్తమానంలో మనిషి నిలకడగా ఉండకపోవడానికి ఉన్న పెద్ద కారణాలలో గతంలోకి తొంగి చూస్తూ ఉండటం ముఖ్యమైనది. గతంలో ఎన్నో పరాజయాలు ఎదురై ఉండవచ్చు. కానీ, వాటిని వేటినీ పట్టించుకోకూడదు. ప్రతి ఒక్కరి జీవితంలో పొరపాట్లు, పరాజయాలు సర్వసాధారణమే. అవి మీ జీవితానికి మెరుగులు దిద్దేవే! ఓటములే లేని జీవితం ఎంత నిస్సారంగా ఉంటుందో తెలుసా! అలాంటి జీవితంలో నేర్చుకోవడానికి ఎవరికీ ఏమీ లభ్యం కాదు. కేవలం కాలంతో ఊరికే అట్లా నడుస్తూ పోవడం అనేది మొదట్లో సుఖవంతంగా అనిపిస్తుందేమో కానీ అది తరువాత ఒక పెద్ద చిరాకుగానూ శూన్యంతో నిండినట్టుగానూ అనిపిస్తుంది.
అలాంటి శూన్యమే మనిషిలో నిస్సహాయత, నిరాశ వంటి వాటిని పొగుచేస్తుంది. ఏదీ చేయలేకపోతున్నామే అనే ఆందోళన, కలవరపాటు చోటుచేసుకుంటుంది. వాటినే కష్టాలనీ, అవి ఎంతగానో బాధిస్తున్నాయని భ్రమ పడుతూ ఉంటారు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే.. సమస్య తెచ్చిపెట్టుకున్నది, ఆ తరువాత దాని వల్ల ఇబ్బంది పడి బాధపడుతున్నది కూడా మనిషే… అలాంటప్పుడు ఎవరైనా సహాయం చేస్తారేమో అని దిక్కులు చూస్తారు. కానీ అది తప్పు. Pull yourself out of difficulties by your- self. There is none to help you... కష్టాలనూ, కడగండ్లనూ స్వశక్తితోనే అధిగమించండి.
చాలా మందికి ఇతరుల ముందు చాలా కఠినంగా ఉంటారు. ముఖ్యంగా ప్రతి చిన్నదానికీ ఇతరులను నిందించడమంటే మహా సరదా.. అలాంటి మనస్తత్త్వాన్ని విడనాడాలి. ఎవరి సమస్యలకు వారే కారణం అయినప్పుడు వాటికి ఇతరులను బాద్యులను చేయడం తప్పు. పైపెచ్చు ఇతరులను నిందించడం వల్ల ఎదురయ్యే పరాభవాలు, పరాజయాలు తోడయ్యి మనిషికి విలువను తగ్గిస్తుంది. అది మనిషిని ఉన్నతస్థానం నుంచి నీచస్థాయికి దిగజారుస్తుంది. అందుకే మనిషిలో ఉన్న ఆ దుర్గుణాన్ని మెల్లగా తుంచేయాలి.
జీవితంలో ఎద్గురయ్యే వైఫల్యాలనూ, తప్పిదాలనూ ఎదుటి వ్యక్తులపైనో, సమాజంపైనో వేసి పరిస్థితుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. పలాయనవాదులుగా, పరాన్నభుక్కులుగా మిగిలిపోతున్నారు. పరీక్షల దగ్గర నుంచి వివాహ వ్యవహారాల వరకు ప్రతి విషయంలో ఇలాంటి పరిస్థితులలోకి వెళ్ళిపోయి అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దుఃస్థితి నుంచి బయటపడటం చాలా ముఖ్యం.
రాజ్యాలు, వైభవాలు, యుద్ధాలు, విజయాలు ఇవేవీ నిజానికి చరిత్ర కాదు! అద్భుతాలను సాధించిన కొందరు మహాపురుషుల జీవనప్రవాహమే చరిత్ర. ఆత్మవిశ్వాసం ఆ మహానుభావుల హృదయాలలో ప్రకాశించింది. నాగరకత అభివృద్ధిలో వారిని ముందుకు తీసుకువచ్చిన క్రియాశక్తి ఏదైనా ఉందంటే అది ఈ ఆత్మవిశ్వాసమే! మనకు ఏదైనా నష్టం, దోషం సంభవించాయంటే అవన్నీ కూడా మనం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన నాటి నుంచే ప్రారంభమయ్యాయి. ప్రపంచం అభివృద్ధి చెందుతుంది కానీ.. నేటికీ మనిషి ఎక్కడో అలాంటి తప్పటడుగులే వేస్తున్నాడు. ఆత్మవిశ్వాసాన్నీ, ఆత్మాభిమానాన్నీ కోల్పోయి అభివృద్ధి పేరుతో, ఆధునికత పేరుతో సానుకూలం కాని సరంజామాను జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ రోజుల్లో అన్నీ తెలిసినా, కర్ణుడి శస్త్రజ్ఞానంలా అవసరానికి అవి ఉపయోగపడడం లేదు.
ఇప్పటి యువతలో సామర్థ్యానికి కొదవలేదు. సౌశీల్యమే కొరవడింది. సామర్థ్యం మనిషిని ఉన్నతస్థాయికి తీసుకువెళుతుంది. కానీ, సౌశీల్యం మనిషిని ఆ ఉన్నతస్థానంలో శాశ్వతంగా ఉంచుతుంది. నేడు సమాజంలో ఎన్నో ఉన్నతస్థానాలను అధిరోహించ గలుగుతున్నా, అక్కడి నుంచి కొన్నాళ్ళకే పతనమైపోవడానికి కారణం ప్రతిభకు తగ్గ ప్రవర్తన లేకపోవడమే! ఈ ప్రవర్తన ఎంత ముఖ్యమో తెలుసుకున్నవాడు మెట్టు దిగజారకుండా పటిష్టమైన కోటను కట్టుకుంటాడు. కానీ ప్రవర్తన సరిగ్గా లేనివాడు తనకు తానే వైఫల్యాలను కొనితెచ్చుకుని పేకమేడలా కూలిపోతాడు. అందుకే ప్రతిభకు తగిన ప్రవర్తన అలవరచుకుని మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మారాలి. ఆ దిశగా అడుగులు వేయాలి.
◆నిశ్శబ్ద.