కిచ‌కిచ‌ల చ‌ప్పుడు.... నిశ్శబ్దంగా కనుమరుగవుతోందా?

పిచ్చుకలు.. ఒకప్పుడు గ్రామాల నుండి పట్టణాల వరకు చాలా మందికి సుపరిచితం.  ఇంటి వరండాలో.. ఇంట్లో.. గూళ్లు పెట్టుకుని అల్లరి చేసే ఈ పిచ్చుకలు క్రమంగా ఇంటి కిటికిలలో,  ముంగిట్లో దండెలా మీద కనిపించేవి. కానీ ఇప్పుడో.. అసలు పిచ్చుకలు కనిపించడమే లేదు.  ఇప్పటి తరం పిల్లలకు పిచ్చుక అంటే పుస్తకంలో చూసి గుర్తుపెట్టుకునే ఒక చిత్రం మాత్రమే అయ్యింది.  ఒకప్పుడు మన పరిసరాలలో విడదీయరాని భాగంగా ఉన్న పిచ్చుకల జనాభా గత కొన్ని సంవత్సరాలుగా బాగా తగ్గింది. ఈ చిన్న పక్షుల జనాభా తగ్గడం ఆందోళన కలిగించే విషయం ఎందుకంటే అవి సహజ తెగులు నియంత్రణ  కీటకాలను తినడం, తెగులు నియంత్రణలో సహాయపడటం చేస్తాయి.  అంటే ఇవి రైతన్నలకు ఎంతో సహాయం చేస్తాయి.   కానీ ఇలా పిచ్చుకల లాంటి చిన్న పక్షుల  జాతుల జనాభా తగ్గడం గురించి,  వాటిని రక్షించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
 
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం 2025..


2010 లో తొలిసారిగా  ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకున్నారు.  ది నేచర్ ఫరెవర్ సొసైటీ ఆఫ్ ఇండియా,  ఫ్రాన్స్ కు చెందిన ఎకో-సిస్ యాక్షన్ ఫౌండేషన్ ల ఆలోచన ద్వారా  ఈ దినోత్సవం పిచ్చుకల సంరక్షణ గురించి అవగాహన పెంచడం,  జాతుల పరిరక్షణపై ఆలోచనలను రూపొందించడం కోసం ఏర్పాటు  చేయబడింది.  పిచ్చుకల క్షీణతకు గల కారణాలను అధ్యయనం చేయడానికి,  జాతులను అంతరించిపోకుండా రక్షించే చర్యలను గుర్తించడానికి దేశవ్యాప్తంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం గురించి అవగాహన కల్పించడానికి నేచర్ ఫరెవర్ సొసైటీ ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా అభివృద్ధి చేసింది. ఈ వెబ్‌సైట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ జాతుల పిచ్చుకల గురించి సమాచారం,  పిచ్చుకలకు సబంధించిన పెద్ద ఎత్తు ఫొటోల  సేకరణ ఉంది.


ప్రాముఖ్యత..


పిచ్చుకల జనాభాలో నిరంతర తగ్గుదల వాటి జనాభాను చాలా  అంచున పడేసింది. ఈ ఆందోళనకరమైన స్థితి గురించి అవగాహన పెంచడమే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం లక్ష్యం. అందువల్ల పరిరక్షణ పట్ల మక్కువ ఉన్న ప్రజలు ఈ రోజున కలిసి వస్తారు.  పట్టణ ప్రాంతాల్లో పిచ్చుకల జనాభా పరిమితంగా ఉండటానికి కారణం ప్రకృతి,  జీవవైవిధ్యం నుండి పెరుగుతున్న దూరం కావచ్చు.


ప్రపంచ పిచ్చుకల దినోత్సవం  పిచ్చుకల సంరక్షణ,  పట్టణ జీవవైవిధ్యం  తక్షణ అవసరాన్ని స్పష్టంగా చెబుతుంది. పిచ్చుకలను రక్షించడానికి సమిష్టి చర్యను  ప్రేరేపిస్తుంది.


ప్రపంచ పిచ్చుకల దినోత్సవం 2025 థీమ్..


ప్రతి ఏడాదిలాగే 2025 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం  ఇతివృత్తం ఏర్పాటు చేయబడింది. 'ప్రకృతి యొక్క చిన్న దూతలకు నివాళి'. పిచ్చుకల పట్ల మనుషులకు ప్రేమను తిరిగి పుట్టేలా చేయడం, వాటిని సంరక్షించడం,  అందుకోసం చేయవలసిన కార్యకలాపాల వైపు ప్రజలను ప్రేరేపించడం ఈ ఇతివృత్తం లక్ష్యం.

పిచ్చుకల పర్యావరణ ప్రాముఖ్యత..


పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో పిచ్చుకలు కీలక పాత్ర పోషిస్తాయి. సహజ తెగులు నియంత్రకాలుగా పనిచేస్తాయి.  తెగులుకు కారణం అయ్యే  కీటకాలను తింటాయి, తెగులు నియంత్రణలో సహాయపడతాయి.

పరాగసంపర్కం,  విత్తన వ్యాప్తికి కూడా పిచ్చుకలే మూలం. వాటి కదలిక వివిధ మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది. పిచ్చుకల ద్వారా జీవవైవిధ్య పెంపు కూడా జరుగుతుంది. పట్టణ,  గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థకు పిచ్చుకల ఉనికి చాలా ముఖ్యమైనది.

చిన్నతనంలో ఇంట్లో పిచ్చుకల అల్లరితో నిద్రలేచే ఉదయాలు జ్ఞాపకాలలో కాకుండా నేటి బాల్యానికి కూడా అందించాలంటే పిచ్చుకల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పిచ్చుకలకు హాని కలిగించే చర్యలు మానుకోవాలి.  ఈ సృషిలో మానవుడు మాత్రమే కాదు అన్ని జీవులకు జీవించే హక్కు  ఉంది.  ఆ హక్కును మనం వృధా కానీయరాదు.

                                                 *రూపశ్రీ.