ఫ్యూచర్ ఫేకింగ్.. నేటికాలంలో జరుగుతున్న అతిపెద్ద మోసం ఇదే..!

 

ఫ్యూచర్ అంటే భవిష్యత్తు.  భవిష్యత్తు మీద ప్రతి ఒక్కరికీ ఎంతో గొప్ప ఆలోచన ఉంటుంది.  తాము వాస్తవ జీవితంలో ఎంత కష్టపడుతున్నా,  గతంలో ఎన్ని భాధలు పడినా భవిష్యత్తులో గొప్పగా బ్రతకాలని, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అయితే ఇదే భవిష్యత్తు గురించి ఆశ  చూపించి మభ్యపుచ్చి ఒక బంధంలోకి తీసుకొచ్చి తరువాత చెప్పిన మాటలను గాలికి వదిలేసే వారు చాలామంది ఉన్నారు. ఇలా భవిష్యత్తు గురించి మాయమాటలు చెప్పి వివాహం తరువాత  అవేమీ లేవు.. తూచ్ అన్నట్టు ప్రవర్తించడాన్ని ఫ్యూచర్ ఫేకింగ్ అనే పేరుతో పిలుస్తున్నారు రిలేషన్షిప్ నిపుణులు.  ప్రస్తుత కాలంలో జరుగుతున్న అతిపెద్ద మోసం  ఫ్యూచర్ ఫేకింగ్  అని  కూడా చెబుతున్నారు. ఈ ఫ్యూచర్ ఫేకింగ్ అనేది కేవలం భార్యాభర్తల బంధం ఏర్పడే విషయంలోనే కాదు.. చాలా రకాలుగా కూడా చోటు చేసుకుంటోంది.  దీని గురించి అవగాహనతో ఉండటం వల్ల భవిష్యత్తులో పెద్ద నష్టం తప్పించుకోవచ్చని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.  దీని గురించి తెలుసుకుంటే..

వివాహంలో ఫ్యూచర్ ఫేకింగ్..


అమ్మాయిని పువ్వులలో పెట్టి చూసుకుంటాం.  అబ్బాయిది గవర్నమెంట్ ఉద్యోగం,  తండ్రి కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్  అయ్యాడు. కావాల్సినంత ఆస్తి ఉంది.  అందులోనూ ఒక్కడే కొడుకు.  ఇంకేం లోటు ఉంటుంది మీ అమ్మాయికి హాయిగా పెళ్లిచేసేయండి అని పెద్దవాళ్లు అంటారు.


నువ్వంటే నాకు చాలా ఇష్టం. మొదటి చూపులోనే చాలా నచ్చేశావ్..మనిద్దరం ఫ్యూచర్ లో హాయిగా బ్రతకడానికి నేను బోలెడు ప్లాన్స్ వేశాను. హనిమూన్ వెళదాం, నీకు ఇష్టమని ఇంట్లో అరెంజ్మెంట్స్ మార్పిద్దాం అనుకుంటున్నా,   ఒక పెద్ద ఇల్లు ప్రాసెస్ లో ఉంది. అయిదేళ్లు నుండి ఉద్యోగం చేస్తున్నా.. నా సేవింగ్స్ కూడా చాలా ఉన్నాయి.  ప్రాపర్టీస్  ఎలాగో ఉన్నాయి.  నువ్వు మహారాణిలా బ్రతకవచ్చు. నువ్వు ఉద్యోగం కూడా చేయాల్సిన పని ఉండదు..  ఇదీ పెళ్లికొడుకు అమ్మాయితో చెప్పే మాటలు.


ఈడు, జోడు బాగుంటారు.  ఆస్తిపాస్తులు బాగున్నాయని చెబుతున్నారు.  అమ్మాయి బాగుంటే అంతకంటే ఏం కావాలి? ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా పెళ్లి చేసేయండి.. ఇది అమ్మాయి తల్లిదండ్రులకు చుట్టాలు, ఇరుగు పొరుగు ఇచ్చే సలహా..


చివరకు పెళ్లి ఏమో అయిపోతుంది. కానీ అబ్బాయి వైపు పెద్దవాళ్లు చెప్పినవి అబద్దాలు, అబ్బాయి చెప్పినవి అబద్దాలు,  సలహాలు ఇచ్చిన చుట్టాలు నిలదీసి అడిగే పరిస్థితి ఉండదు. మెడలో తాళి,  మగాడితో శారీరక బంధం ఏర్పడిపోయాయి. ఇంకేముంది. అమ్మాయి అదే జీవితాన్ని  అడ్జెస్మెంట్ పేరుతో అత్తింట్లో సంపాదించి  పెట్టే ఒక పర్మినెంట్ పనిమనిషిగా మారిపోయి తన ప్రాప్తం అంతే అనుకుంటుంది.  ఇలాంటి ఫ్యూచర్ ఫేకింగ్ కు బలయ్యే అమ్మాయిలు బోలెడు మంది ఉన్నారు భారతదేశంలో.

ఈ ఫ్యూచర్ ఫేకింగ్  అనేది.. స్నేహితుల మధ్య కూడా ఉంటుంది. స్నేహితులు జీవితం మీద, భవిష్యత్తు మీద ఎంతో ఆశ పెట్టి అప్పులలో దించుతారు, వ్యాపారాలలో దించుతారు,  సమస్యలలో దించుతారు.  ఎడ్యుకేషన్ వైపు ఈ ఫ్యూచర్ ఫేకింగ్ అధికమే.. మీ అబ్బాయిని జీనియస్ ను చేస్తాం అంటారు,  ర్యాంకులు వస్తాయని,  టాప్ కంపెనీలలో ఉద్యోగాలు వస్తాయని అంటారు. తీరా చూస్తే.. గ్రాడ్యుయేట్ పట్టా పెట్టుకుని చిల్లర వ్యాపారాలు చేసుకునే వారు ఎక్కువ అవుతున్నారు. ఆఫీసుల్లోనూ ప్యూచర్ ఫేకింగ్ ఉంటుంది. భవిష్యత్తు మీద ఆశ పెట్టి,  ప్రమోషన్లని, ఇంక్రిమెంట్స్ అని ఉద్యోగస్థుల చేత గొడ్డు చాకిరీ చేయించుకునే యజమానులు బోలెడు ఉన్నారు.  


ఉద్యోగాలు అయినా,  వ్యాపారాలు అయినా, స్నేహితులు అయినా, కళాశాలలు అయినా.. ఒక సారి మోసపోతే మరొక ఆప్షన్ అంటూ ఉండనే ఉంటుంది. కానీ వైవాహిక బంధం దగ్గర మాత్రం అమ్మాయిలు లాక్ అయిపోతారు.  కాబట్టి వివాహం విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. వైవాహిక విషయంలో పెళ్లికి ముందు అబ్బాయి, అతని తరపు వారు చేసిన వాగ్దానాలు ఏవైనా సరే. పెళ్లి తర్వాత నెరవేరలేదు అంటే అతడిని, అతడి వైపు వారిని ఓపెన్ గానే అడగాలి.  అబద్దాలు మనుషుల మధ్య బంధాలను ఎంత బలహీనం చేస్తాయో వారికి వివరించాలి. కనీసం అప్పటి నుండి అయినా ఏ విషయంలో మోసం చేయకుండా చూసుకునే అవకాశం ఉంటుంది.

                                 *రూపశ్రీ.