ఎంపీల వేతనాలు సరే.. రైతుల మాటేమిటి?

లోకసభ, రాజ్యసభ సభ్యుల జీతాల భృత్యాలు పెరిగాయి.  వాస్తవానికి వీరి జీతాలు రెండేళ్ల కిందటే పెరగాల్సి ఉంది.  అయితే జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఇప్పుడు పెంరిగింది. పెరగడమే కాదు.. ఈ పెంపు  2023 నుంచి అమలులోకి వస్తుంది.  రెండేళ్ల  అరియర్స్ కూడా ఎంపీలు అందుకుంటారు. గతంలో  ఎంపీలకు లక్ష రూపాయల వేతనం అందుకునే వారు. ఇప్పుడు అదనంగా 24 వేల రూపాయలు అందుతుంది. అంతే కాకుండా వారికి డిఏ కూడా 500 రూపాయలు పెరిగాయి. ఆఫీసు నిర్వహణకు,ఇంటి అద్దెకు నెలకు గరిష్టంగా రెండు లక్షల60 వేలు వస్తుంది. విమాన ప్రయాణాలు అయితే  ఏడాదికి 34 సార్లు ఉచిత ప్రయాణం. ఉచిత విద్యుత్, నీరు తదితర అలవెన్సులు ఇస్తారు. ప్రజా ప్రతినిధులకు జీతాలు పెంచడంలో తప్పులేదు. గతంలో అన్నీ త్యాగం చేసి ఎంపీలుగా పనిచేసిన వారు పదవి పూర్తయిన తరువాత  బతకడం కష్టంగా ఉండేది. 
ప్రజా ప్రతినిధులకు  జీతాల పెంపు పట్ల ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు కానీ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసిన వారి పింఛన్ల విషయాన్ని కూడా కేంద్రం పట్టించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం సామాజిక  పింఛన్లే  4000 రూపాయలు ఉన్నాయి. కానీ ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారికి వచ్చే పెన్షన్ వేయి రూపాయలు మాత్రమే కావడంతో , ఇటువంటి వారి పెన్షన్ ను కూడా పెంచాల్సిన అవసరం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది.  
అదే విధంగా రైతుల పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉంది.  సరైన మద్దతు ధర లభించడంలేదు. రైతు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసే ధరకు, అది వినియోగదారుడు కొనుగోలు చేసే సమయంలో ఉన్న ధరకూ వ్యత్యాసం భారీగా ఉంటోంది. అంటే రైతు కష్టం దళారుల పాలౌతోంది. ఈ దళారి వ్యవస్థను తొలగించి రైతుకే నేరుగా లాభసాటిగా ఉండేలా ధ్యాన్యం విక్రయాలు నెరపుకునే అవకాశం కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.   దేశంలోని అన్ని వర్గాలకు కనీస అవసరాలకు సరిపడా  వేతనం లేదా పింఛన్లు వచ్చేలా  చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే వృద్ధులకు 70 ఏళ్ల తరువాత ఉచిత ఆరోగ్యం కల్పిస్తామని ప్రధాని పేరుమీద పథకం ప్రకటించారు. కాని దాన్ని 60 ఏళ్ల నుంచి అమలు చేయాల్సిఉంది. దేశాన్ని ఇన్ని  సమస్యలు  పట్టి పీడిస్తుండగా అత్యంత జరూరుపనిలోలాగా ఎంపీల జీతాల పెంపు కార్యక్రమం చేపట్టడం పట్ల ఒకింత అసంతృప్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎంపీల జీతాల పెంపుతో6పాటే.. రైతులజీవితాలు,వృద్ధుల జీవితాలు బాగుపడే నిర్ణయం కూడా తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.