నీలోనే ప్రపంచం
posted on Jul 8, 2019 10:48AM
సోక్రటీసు గురించి తెలియని వారెవరు? రెండు వేల సంవత్సరాలకు పూర్వమే... మానవుడి తర్కానికి కొత్త దిశను చూపినవాడు. తత్వశాస్త్రానికి కొత్త దశను అందించినవాడు. కర్మ, నరకం లాంటి నమ్మకాల స్థానంలో మానవ ప్రయత్నాన్ని స్థాపించినవాడు. అలాంటి సోక్రటిస్ చాతుర్యం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి ఇప్పుడు చదివి చూడండి... ఏదన్నా కొత్త విషయం తెలుస్తుందేమో!
ఒకసారి సోక్రటిస్ తన ఏథెన్సు నగర ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడట. ఆ సమయంలో ఒక మనిషి ఏథెన్సులో ప్రవేశిస్తూ `మీరు చూస్తే గొప్ప జ్ఞానిలాగా కనిపిస్తున్నారు. నేను మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా` అన్నాడు.
`ఓ దానికేం భాగ్యం!` అన్నారు సోక్రటిస్
`నేను నా నగరాన్ని విడిచిపెట్టి ఇక నుంచి మీ ఏథెన్సులోనే నివాసం ఉండాలని అనుకుంటున్నాను. ఈ నగరం ఎలా ఉంటుంది?` అని అడిగాడు.
`ఆ విషయం చెప్పేముందర... ముందు మీ నగరం ఎలా ఉంటుందో ఓసారి చెప్పగలరా!` అని అడిగాడు సోక్రటిస్. `నా నగరాన్ని తల్చుకుంటేనే భయం వేస్తుంది. అక్కడ అంతా దుష్టులూ, దుర్మార్గులే! నమ్మించి నట్టేట ముంచేవారే! అక్కడి నుంచి వచ్చేసమయానికి నాకు శత్రువులే కానీ మిత్రడు అన్నవాడు ఒక్కడు కూడా మిగల్లేదు` అని వాపోయాడు ఆ పెద్దాయన.
`అయ్యో, అలాగా పాపం! కానీ మీ దురదృష్టం ఏమిటంటే ఏథెన్సు కూడా మీకు అలాంటి అనుభవాలనే ఇవ్వబోతోంది. మీకు ఇష్టమైతేనే లోపలకి అడుగుపెట్టండి`అన్నాడు సోక్రటిస్.
ఆ వచ్చినవాడు సోక్రటిస్ మాటలకు దిగాలుపడిపోయి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏథెన్సులోకి ప్రవేశించాడు.ఇంతలో మరో మనిషి సోక్రటిస్ దగ్గరకు వచ్చాడు `అయ్యా నేను మీరు ఇప్పటిదాకా చెబుతున్న మాటలు విన్నాను. నేను కూడా నా నగరం నుంచి వచ్చేసి ఏథెన్సులో స్థిరపడాలని అనుకుంటున్నాను. నిజంగానే ఏథెన్సు ప్రజలు దుర్మార్గంగా ఉంటారా?` అని అడిగాడు.
సోక్రటిస్ చిరునవ్వుతో `ఆ విషయం చెప్పేముందు, నువ్వు ఇప్పటిదాకా ఉన్న నగరం ఎలా ఉండేదో చెబుతావా!` అని ఎదురు ప్రశ్నించాడు.
`అయ్యో! నా నగరానికేం తక్కువ. అక్కడ అంతా కలిసిమెలిసి ఉండేవారు. కరుణతో మెలిగేవారు. నాకు చాలా గౌరవం ఇచ్చేవారు. ఏదో కొత్త చోట కొన్నేళ్లు గడుపుదామని ఇప్పుడు ఏథెన్సుకి వస్తున్నానన్న మాటేగానీ, నా నగరాన్ని విడిచిపెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు.` అంటూ చెప్పుకొచ్చాడు.
`మంచిది! అయితే మీరు ఏథెన్సు ప్రజలు కూడా అంతే ప్రశాంతంగా, కలుపుగోలుగా ఉండటాన్ని చూస్తారు. ఏథెన్సుకి స్వాగతం,` అన్నాడు సోక్రటిస్ చిరునవ్వుతో.
ఈ కథలో సోక్రటిస్ ఏం చెప్పదల్చుకున్నాడో తేటతెల్లంగా తేలిపోతోంది. ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు కాస్త భిన్నంగా ఉండవచ్చు. కానీ మనిషి దృక్పథాన్ని బట్టి కూడా కొంత ప్రభావం ఉంటుంది అన్నదే ఈ కథలోని సారాంశం. దుర్యోధనుడికి ఈ ప్రపంచంలో అంతా క్రూరులుగానే కనిపించారు. ధర్మరాజుకి ఈ లోకం అందమైనదిగా తోచింది. ఇదే విషయాన్ని సోక్రటిస్ తనదైన శైలిలో చెప్పాడు. మనల్ని బట్టే ఈ ప్రపంచం ఉంటుందని ఓ సూచనను అందించాడు... అంతే!
-నిర్జర