ఇంటర్ విద్యార్థులకు డోక్కా సీతమ్మ మధ్యాహ్న బోజన పథకం.. అమలుకు సర్వం సిద్ధం
posted on Jan 3, 2025 2:45PM
జగన్ హయాంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుదేలైంది. ముఖ్యంగా ఇంటర్మీడియేట్ విద్య పూర్తిగా గాడి తప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఫలి తాల మెరుగునకు పలు చర్యలు చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం నుంచి అమలు చేయనున్నారు. ఈ పథకాన్ని విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు 398 సమీపంలోని పాఠశాలలు అనుసంధానమై ఉన్నాయి. అక్కడ భోజనాలను తయారు చేస్తారు. మిగిలిన 77 కళాశాలలను వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం అమలుకు ఈ ఏడాది రూ.27.39 కోట్లు. వచ్చే విద్యాసంవత్సరంలో రూ.85.84 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేష్ కంకణం కట్టుకున్నారు.
ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఎపి మోడల్ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, హైస్కూలు ప్లస్ స్కూళ్లలో విద్యనభసిస్తున్న 2లక్షల మందికి పైగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేసింది. బోధనా విధానాన్ని మెరుగుపర్చేందుకు జిల్లా, రీజనల్ స్థాయిలో అకడమిక్ గైడెన్స్ అండ్ మానిటరింగ్ సెల్ లను ఏర్పాటు చేసింది. చిత్తూరు జిల్లాలోని 25, గుంటూరు జిల్లాలోని 4 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఐఐటి మద్రాసు సహకారంతో విద్యాశక్తి పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నది. దీనిద్వారా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు సబ్జెక్టులలో విద్యార్థుల సామర్థ్యం పెంచాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఐఐటి మద్రాసులో శిక్షణ పొందిన నిపుణులైన అధ్యాపకులు ప్రతిరోజూ సాయంత్రం 4నుంచి 5గంటల వరకు జూమ్ మీటింగ్ ద్వారా విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మెళుకువలు నేర్పుతున్నారు. క్రమం తప్పకుండా పేరెంట్ – టీచర్స్ సమావేశాలను నిర్వహిస్తూ విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేస్తున్నారు. మొత్తం మీద మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇంటర్ విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.