అవును నేను బీహార్‌వాడినే!
posted on Jun 6, 2016 10:44AM
బీహార్ అనగానే బుద్ధుడు గుర్తుకురావడం మానేసి చాలా రోజులే అయ్యింది. ప్రస్తుతానికి బీహార్ అనగానే అసాంఘిక కార్యకలాపాలే గుర్తుకువస్తాయి. నిరక్షరాస్యతకు, వెనుకబాటుతనాకికీ ప్రతినిధిగా బీహార్ తోస్తుంది. ఆ మధ్య కాలంలో బీహార్ కాస్త వెనుకబడిన మాట వాస్తవమే. దానికి తోడు ఘనత వహించిన కొందరు నేతలు బీహార్ అంటేనే అన్యాయం, అరాచకం అన్న స్థాయికి అక్కడి పరిస్థితులను దిగజార్చారు. దాంతో బీహార్ అన్నా, బీహారీలు అన్నా ఒక బూతు పదంగా మారిపోయింది. ‘నేను బీహార్ వాడిని’ అని చెప్పుకోవడమే అవమానకరంగా మొదలైంది. నితీశ్ పాలన తరువాత బీహార్‌లో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. అక్కడ ప్రస్తుతం మద్య నిషేధంలాంటి ప్రగతిశీలమైన కార్యక్రమాలు సాగుతున్నాయి. నిరక్షరాస్యత, నిరుద్యోగంలో తగ్గుదల కనిపిస్తోంది. అయినా బీహార్ అన్న పదానికి ఉన్న అప్రతిష్ట ఏమాత్రం తగ్గలేదు. ఈ పరిస్థితిలో ఎంతోకొంత మార్పు తీసుకురావాలనుకున్నారు కొందరు. వారి ఆలోచనను అనుసరిస్తున్నారు మరికొందరు. ఇంతకీ ఆ ఆలోచన ఏమిటంటే.....
‘పాట్నా బీట్స్’ అనే వెబ్‌సైటుని నడుపుతున్న హబీబుల్లాకి ‘నేను బీహారీని’ అని చెప్పుకోవడాన్ని ఒక నామోషీగా కాకుండా, ఒక గుర్తింపుగా మార్చాలని తోచింది. అందుకోసం ఆయన #IamBrandBihar అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇందులో భాగం కావాలనుకున్నవారంతా తాము బీహారీలమని గర్వంగా చాటుతారు. ఐపీఎస్ ఆఫీసర్లు మొదల్కొని అందాల భామల వరకూ తామూ బీహారీలమంటూ ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి చాటుతున్నారు. అలాగని ఏదో గొప్పగొప్ప సెలబ్రెటీలు లేదా విజయాలను సాధించినవారే ఇలా చాటేందుకు ముందుకు వస్తున్నారనుకోవడానికి లేదు. రైల్వే కూలీలు, టీకొట్టువారు, పూలమ్ముకునేవారు... ఇలా బీహార్‌లోని ప్రతి ఒక్క పౌరుడూ.... తాను బీహారీనంటూ గర్వంగా చాటుకునేందుకు ముందుకు వస్తున్నాడు.
#IamBrandBihar ప్రచారం మొదలైన తరువాత బీహారీ పట్ల మిగతా దేశ ప్రజల దృక్పథం మారిందంటున్నారు. అంతేకాదు! బీహారీలలో కూడా తాము ఎవ్వరికీ తీసిపోమన్న ఆత్మవిశ్వాసం కలుగుతోందట. ఈ పరిస్థితి చూస్తుంటే మనం కూడా ‘నేను కూడా తెలుగువాడినే’ అంటూ ఓ ప్రచారాన్ని మొదలుపెడితే బాగుండు అనిపిస్తోంది కదా! ఎందుకంటే మనకి, తెలుగువారమని చెప్పుకోవడం మహా సిగ్గుచేటు కదా!
- నిర్జర.