వరంగల్ ఎన్నికలకి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎస్.రాజయ్య?
posted on Oct 31, 2015 4:11PM
వచ్చే నెల 21వ తేదీన జరుగబోయే వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొదట అక్కడి నుండి పెద్దపల్లి మాజీ ఎమ్.పి వివేక్ ను పోటీ చేయమని కాంగ్రెస్ ఒత్తిడి చేసినప్పటికీ ఆయన అంగీకరించకపోవడంతో రాజయ్యను కానీ సర్వే సత్యనారాయణను గానీ నిలబెట్టాలని భావించింది. వారిలో సర్వే సత్యనారాయణ వరంగల్ నుండి పోటీ చేయడానికి చాలా ఆసక్తి చూపినప్పటికీ స్థానికుడయిన రాజయ్య అయితేనే తెరాస, ఎన్డీయే అభ్యర్ధులను డ్డీకొని విజయం సాధించగలరని కాంగ్రెస్ అధిష్టానం భావించడంతో రాజయ్యపేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
తెరాస తన అభ్యర్ధిగా వసునూరి దయాకర్ పేరును ఖరారు చేసింది. ఈ ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని తెదేపా నిశ్చయించుకొంది. కనుక బీజేపీ, వైకాపాలు ఇంకా తమ అభ్యర్ధుల పేర్లు ప్రకటించవలసి ఉంది. అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు నవంబర్ 4తో ముగుస్తుంది. కనుక ఆలోగా అన్ని పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటించి నామినేషన్లు వేయవలసి ఉంటుంది.