మొలకలు వచ్చిన బంగాళదుంపలతో ముప్పు.. అంతా ఇంతా కాదు!


బంగాళదుంపలు భారతీయులకు మాత్రమే కాకుండా విదేశీయులకు కూడా ఇష్టమైన ఆహారం.  తినడానికి రుచిగా,  వండటానికి ఈజీగా ఉండే బంగాళదుంపలను ప్రతి వంటిట్లోనూ చూడవచ్చు. ఏ కూర చేయాలో అర్థం కాని వారికి బంగాళదుంప బంగారంలా కంగారు తగ్గిస్తుంది.  ముక్కలుగా కోసి నూనెలో వేపి కాసింత ఉప్పు, కారం చల్లితే అన్నంలో కలుపుకుని తినడానికి అయినా,  సైడ్ డిష్ కోసం అయినా, రోటీలలోకి అయినా ఇట్టే సెట్ అవుతుంది. ఇక బంగాళదుంపలు కేవలం కూరలాగానే కాకుండా పానీ పూరి నుండి చిప్స్ వరకు ప్రతి ఒక్క చోట తన ట్యాగ్ వేస్తుంది.  ఈ కారణాల వల్ల బంగాళదుంపకు కాసింత క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అయితే చాలా ఇళ్లలో బంగాళదుంపల మీద చిన్నగా మొలకలు రావడం గమనించి ఉంటారు. ఈ మొలకలను తొలగించి హాయిగా కూర వండేసుకోవడమే అందరికీ తెలుసు.. కానీ ఇలాంటి బంగాళదుంపలతో పెద్ద ముప్పేనని ఆహార నిపుణులు అంటున్నారు.

మొలకెత్తిన బంగాళదుంపలు..

మొలకెత్తిన బంగాళదుంపల మీద ఉన్న మొలకలు తొలగించి వండుకునే వారికి పెద్ద షాకే తగులుతోంది.  ఇలా మొలకలు వచ్చిన బంగాళదుంపలను వండుకుని తినడం అంటే విషాన్ని తినడమేనట.. మొలకలు వచ్చిన బంగాళదుంపలు కానీ,  బంగాళదుంపల మీద లేత ఆకుపచ్చ రంగు ఉన్నా కానీ ఇవి మంచివి కాదట. ఇలాంటి బంగాళదుంపలలో సోలనైన్, చకోనైన్ వంటివి ఉత్పత్తివి.  ఇవి చాలా విషపూరితమైన సమ్మేళనాలు.  వీటిని తీసుకుంటే కడుపు ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా కడుపులో తిప్పడం,  విరేచనాలు,  కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవి మాత్రమే కాకుండా తల తిరగడం,  తలనొప్పి, నరాల సంబంధ సమస్యలు పెంచుతాయి.

బంగాళదుంపలు ఇలా తినకండి..

బంగాళదుంపలు వేయించి తినడం చాలా మందికి ఇష్టం.  ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి.  ఈ కారణంగానే బంగాళదుంపల చిప్స్, లేస్,  బింగో, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి స్నాక్స్ కు కూడా బాగా డిమాండ్ ఉంది ఇప్పట్లో. అయితే ఇలా తినడం అస్సలు మంచిది కాదు. ఇవి రక్తపోటును పెంచుతాయి.  కేలరీలు కూడా ఎక్కువగా అందిస్తాయి.  ఈ కారణంగా బరువు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది.

ఎలా తినాలి..

బంగాళదుంపలు తినడానికి సరైన మార్గం వాటిని ఉడికించి తినడం. బంగాళదుంపలు ఉడికించి తిన్నా, వాటిని వివిధ రకాల కూరలలో భాగం చేసి ఉడికించినా మంచిది.  సాంబార్,  కిచిడి, ఉప్మా, కూర్మా వెజిటబుల్ రైస్ వంటి వాటిలో భాగం చేయవచ్చు.


                                          *రూపశ్రీ.