పాపం...రాజుగారు!
posted on Apr 10, 2015 10:49AM
సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన దోషిగా నిర్ధారించబడిన రామలింగ రాజు పరిస్థితి చూసిన వారెవరికయినా ‘అయ్యో పాపం రాజుగారు…’అనుకోకుండా ఉండలేరు. కోర్టు ఆయనకి జైలు శిక్ష ఖరారు చేసేముందు తను రాష్ట్రానికి దేశానికీ చేసిన సేవల ఆయన స్వయంగా గురించి చెప్పుకొని, వాటిని దృష్టిలో పెట్టుకొని శిక్షను ఖరారు చేయమని ఆయన కోర్టును వేడుకొంటునప్పుడు ఎవరికయినా మనసు చివుక్కు మానకమానదు. తను నేరం చేసానని, దానిని దైర్యంగా అంగీకరించి ప్రజలకు, ప్రభుత్వానికీ క్షమాపణలు చెప్పుకొని, దాదాపు మూడేళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించాను కనుక ఇకనైనా తనపై కనికరం చూపవలసిందిగా ఆయన కోర్టులో న్యాయమూర్తిని వేడుకొంటున్నప్పుడు ‘అయ్యో! పాపం రాజుగారు...’అని అనుకోకుండా ఉండలేము. ఆయన అభ్యర్ధనను న్యాయమూర్తి తిరస్కరించి ఏడేళ్ళు జైలు శిక్ష వేస్తున్నట్లు ప్రకటించినప్పుడు ఆయన బాధను చూసినవారు ‘అయ్యో’ అనుకోకుండా ఉండలేరు. జూబ్లీ హిల్స్ లో తన నివాసం నుండి కారులో వచ్చిన ఆయనని పోలీస్ వ్యానులో చర్లపల్లి జైలుకి తరలిస్తున్నప్పుడు ‘అయ్యో’ అనిపించక మానదు. కానీ నేరం చేసినవారు ఎంతవారయినా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా శిక్ష అనుభవించక తప్పదు కదా అనుకొని సరిపెట్టుకోక తప్పదు.
కానీ అనేక ఆర్ధిక నేరాలకి పాల్పడిన వారు, ప్రజల సొమ్మును, ప్రభుత్వ భూములను, ఆస్తులను దిగమింగినవారు, డజన్ల కొద్దీ చార్జ్ షీట్లు వేసినా, జైలుకెళ్ళివచ్చినా చట్టసభలకి వెళ్ళగలుగుతున్న వారు, జనాల మధ్యకి వెళ్లి నీతి నిజాయితీ అంటూ ఉపన్యాసాలిచ్చేవారు చట్టంలో లొసుగులను రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొంటూ దర్జాగా బయట తిరుగుతున్నప్పుడు, రాష్ట్రానికి, దేశానికీ ఎంతో సేవ చేసిన రామలింగ రాజు తను చేసిన నేరాన్ని నిజాయితీగా అంగీకరించి, అందుకు భారీ జరిమానాలు చెల్లించి, జైలు శిక్ష కూడా అనుభవించిన తరువాత మళ్ళీ జైలుకి వెళుతుంటే మనసు చివుకుమానకమానదు.
చట్టంలో లొసుగులను అడ్డుపెట్టుకొని తప్పించుకొని తిరగదలిస్తే బహుశః ఆయన కూడా ఈ జైలు శిక్ష నుండి తప్పించుకోగలిగేవారేమో? కానీ అనేక నేరాలు చేసి బెయిలు పొంది దర్జాగా బయట తిరుగుతున్న వారితో పోల్చి చూసినట్లయితే ఈ పరిస్థితుల్లో కూడా ఆయన నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్నందునే జైలుకి వెళుతున్నారనిపిస్తుంది. రేపు ఆయన తరపు లాయర్లు హైకోర్టులో బెయిలు కోసం పిటిషను దాఖలు చేస్తే దానికి కోర్టు ఆమోదం తెలిపితే ఆయనకు కొంత ఉపశమనం దొరుకుతుంది. లేకుంటే మళ్ళీ రాజుగారికి జైలు జీవితం తప్పదు పాపం.