దేవుడా.. ఈరోజు గడిస్తే చాలు...

 

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రజలు, పోలీసుల మనసులలో ఒకే ఒక్క మాట పదేపదే మెదులుతోంది. అది... ‘‘దేవుడా.. ఈరోజు గడిస్తే చాలు’’. అవును ఈరోజు శుక్రవారం.. హైదరాబాద్‌లో భారీగా మసీదుల వద్ద ప్రార్థనలు జరిగే రోజు. ఈరోజున సంఘ విద్రోహ శక్తులు ఎలాంటి విద్రోహ చర్యలకు పాల్పడకుండా, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా వుండాలని అందరూ కోరుకుంటున్నారు. కారణం.. మూడు రోజుల క్రితం వికారుద్దీన్‌తో సహా ఐదుగురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్లో చనిపోవడమే. నరరూప రాక్షసుల్లాంటి కరడుగట్టిన ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్లో మరణించడాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన చర్యగా చిత్రీకరించడానికి కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది మతపెద్దలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.

 

కొంతమందిలో వికారుద్దీన్ బ్యాచ్ చనిపోవడం ఎంతో బాధ కలిగిస్తోంది. వికారుద్దీన్ అంత్యక్రియలకు వేలాదిమంది హాజరై కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎన్‌కౌంటర్లో చనిపోయింది ఎంతోమందిని చంపిన తీవ్రవాదులన్న విషయం వారిలో ఎవరికీ గుర్తున్నట్టే లేదు. సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా ఈ తీవ్రవాదులు చనిపోవడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని అంటూ కళ్ళు ఒత్తుకున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.

 

ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు జరిగే ప్రార్థనల సందర్భంగా పలు ప్రదేశాలలో కొంతమంది రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే అవకాశం వుందని, అలాగే అల్లర్లు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదని పోలీసులు భయపడుతున్నారు. ప్రజల్లో కూడా ఈ భయం వుంది. అందుకే పోలీసులు హైదరాబాద్‌లో శుక్రవారం నాడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నాడు హైదరాబాద్‌లో భారీ స్థాయిలో పోలీసు బలగాలు మొహరించాయి. ముఖ్యంగా మసీదులు ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu