అమెరికా పాఠశాలలో కాల్పులు : 18 విద్యార్దులు మృతి

 

  

 

అగ్రరాజ్యం అమెరికాలో ఉన్మాదుల కాల్పుల పర్వం కొనసాగుతూనే ఉంది. అమాయకుల ప్రాణాలకు అక్కడ విలువ లేదని వరుస సంఘటనలు రుజువు చేస్తున్నాయి. కనెక్టికట్ లోని న్యూస్ టౌన్ లో గల శాండీ హుక్ అనే ప్రైమరీ స్కూల్ లో ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది.

 

ఈ సంఘటనలో18 మంది విద్యార్దులు, 9 మంది స్కూల్ సిబ్బంది ప్రాణాలను కోల్పోయారు. ఇదే స్కూల్ లో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయురాలి తనయుడు 20 ఏళ్ల లాన్జా రెండు తుపాకులతో స్కూల్ లోపలికి చొరబడ్డాడు. నర్సరీ తరగతి గదిలోకి వెళ్లి విచక్షణారహితంగా చిన్నారులఫై కాల్పులు జరిపాడు. మొత్తం 27 మందిని పొట్టన బెట్టుకున్న అనంతరం ఈ ఉన్మాది తనఫై కాల్పులు జరుపుకొని చనిపోయాడు.

 

ఈ సంఘటనతో అప్రమత్తమైన పోలీసులు స్కూల్ సమీపంలో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. ఈ స్కూల్ లో మొత్తం ఆరు వందల మంది విద్యార్దులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కాల్పులలో గాయపడిన విద్యార్దులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలిసిన వెంటనే, విద్యార్దుల తల్లి తండ్రులు ఆందోళనతో స్కూల్ వద్దకు చేరుకున్నారు. ఈ కాల్పులలో లాన్జా కు సహకరించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

 

ఈ సంఘటన ఫై అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా విచారం వ్యక్తం చేశారు. ఇంత మంది చిన్నారులు మరణించడం తట్టుకోలేని ఆయన కంట తడి పెట్టారు. దీని ఫై విచారణ జరిపి చర్యలు తీసుకొంటామని అధ్యక్షుడు ప్రకటించారు.