ఐసిస్ ఉగ్రవాదులకి టర్కీ పరోక్షమద్దతు ఇస్తోంది: పుతిన్
posted on Nov 27, 2015 11:47AM
.jpg)
మూడు రోజులక్రితం రష్యాకు చెందిన ఒక యుద్ద విమానాన్ని టర్కీ కూల్చి వేయడంపై ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. టర్కీ నుండి రష్యా దిగుమతి చేసుకొనే అనేక ఉత్పత్తులను తీసుకోవడం నిలిపివేసింది. టర్కీ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని రష్యా కోరుతోంది. కానీ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఇర్డోగాన్ ప్రకటించడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదీమీర్ పుతీన్ మండిపడ్డారు. తప్పు చేసిన టర్కీకి అమెరికా మద్దతు పలకుతుండటాన్ని కూడా ఆయన తప్పు పట్టారు.
పుతీన్ నిన్న మీడియాతో మాట్లాడుతూ “మా యుద్ద విమానం టర్కీ గగనతలంలో ప్రవేశించినందునే కూల్చివేశామని ప్రకటించింది. కానీ ఇప్పుడు మా యుద్ద విమానాన్ని సరిగ్గా గుర్తించలేకపోయినందునే కూల్చివేశామని చెపుతున్నారు. మా యుద్ద విమానంపై చాలా స్పష్టమయిన చిహ్నాలు ఉన్న సంగతి వారికీ తెలుసు. అది చేసిన తప్పుకి బేషరతుగా క్షమాపణలు చెప్పకపోగా ఇటువంటి వితండవాదనలు చేయడం మాకు ఇంకా బాధ కలిగిస్తోంది. మా విమానం ఆ సమయంలో ఏ దిశలో, ఎంత ఎత్తులో ప్రయానిస్తోందో అన్ని వివరాలు టర్కీకి మద్దతు ఇస్తున్న అమెరికాకి కూడా తెలుసు. అయినా కూడా టర్కీకి మద్దతు ఇస్తోందంటే దానర్ధం ఏమిటి?” అనిపుతీన్ ప్రశ్నించారు.
టర్కీపై పుతీన్ తీవ్ర ఆరోపణలు చేసారు. “సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్న చమురు బావుల నుండి టర్కీ చాలా భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. సిరియా నుండి కొనుగోలు చేస్తున్న చమురును టర్కీ వాహనాలు తీసుకువెళ్ళడం పైనుండి మా యుద్ద విమానాలలో పైలట్లు గమనిస్తూనే ఉన్నారు. ఐసిస్ ఉగ్రవాదుల వద్ద నుండి టర్కీ చమురు కొనుగోలు చేస్తుండటం వలననే ఉగ్రవాదులకు భారీ ఆదాయం, దానితో మారణాయుధాలు సమకూర్చుకొని మా దేశాల మీద దాడులు చేస్తున్నారు. టర్కీ కొంటున్నది కేవలం చమురు మాత్రమే కాదు మా దేశాల రక్తాన్ని కూడా. అది ఉగ్రవాదులకు ఈవిధంగా ఆర్ధిక సహాయం అందిస్తూ ప్రపంచ దేశాల ప్రజల జీవితాలను పణంగా పెడుతోంది. మేము ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులపై పోరాడుతుంటే టర్కీ వారికి ఈవిధంగా సహాయపడటం చాలా దారుణం,” అని అన్నారు.