ఆనం బ్రదర్స్ చేరికతో నెల్లూరులో తెదేపా బలపడే అవకాశం?

 

మాజీ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ఆయన సోదరుడు ఆనం వివేకానంద రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని వీడి త్వరలోనే తెదేపాలో చేరబోతున్నట్లు ప్రకటించేరు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెదేపా విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ, నెల్లూరు జిల్లాలో గల 10 అసెంబ్లీ స్థానాలలో తెదేపా కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. మిగిలిన 7స్థానాలు, ఒక లోక్ సభ సీటును కూడా వైకాపా గెలుచుకొంది. తెదేపా ప్రస్తుతం అధికారంలో ఉంది కనుక నెల్లూరులో ఆ బలహీనత పైకి కనబడదు. కానీ ఎన్నికల సమయం వచ్చినప్పుడు మాత్రం అది బయటపడుతుంది. అందుకే నెల్లూరులో వైకాపాను డ్డీ కొనగల ఆనం సొదరులను మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకొన్నారు. వారి చేరికకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి జిల్లాకు చెందిన సీనియర్ నేతలు అభ్యంతరం చెప్పారు కానీ వారందరికీ నచ్చజెప్పి ఆనం సోదరులకు చంద్రబాబు నాయుడు లైన్ క్లియర్ చేసారు.

 

ఇక జిల్లాలో వైకాపా చాలా బలంగా ఉన్నట్లు పైకి కనబడుతున్నప్పటికీ పార్టీలో అంతర్గతంగా నేతల మధ్య కీచులాటలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో మేకపాటి రాజమోహన్ రెడ్డి వర్గం తమను పట్టించుకోకుండా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తోందని, మేకపాటి పెత్తనం సహించబోమని జిల్లా వైకాపా అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కారణంతో ప్రసన్నకుమార్ ఐదు నెలల క్రితం తన పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్దపడ్డారు. కానీ అతనిని పార్టీ అధిష్టానం బుజ్జగించడంతో ప్రస్తుతం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆనం బ్రదర్స్ తెదేపాలో చేరడం వలన నెల్లూరు జిల్లాలో పార్టీ బలపడే అవకాశం ఉంటుందని భావించవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu