తెలంగాణా ప్రభుత్వమే రేవంత్ రెడ్డిని హీరోని చేస్తోందా?

 

ఊహించినట్లే రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని కోరుతూ ఎసిబి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఒకవేళ సుప్రీంకోర్టు ఎసిబి విన్నపాన్ని మన్నించితే రేవంత్ రెడ్డిని మళ్ళీ జైలుకి పంపించవచ్చు. అలాకాక ఒకవేళ సుప్రీంకోర్టు కూడా రేవంత్ రెడ్డికి బెయిలు మంజూరు చేయడాన్ని సమర్ధిస్తే ఇక ఆయనని అడ్డుకోవడం తెలంగాణా ప్రభుత్వానికి చాలా కష్టం అవుతుంది. కనుక మున్ముందు ఏ మునిసిపాలిటీవాళ్ళో లేక ఆదాయపన్ను శాఖ వాళ్ళో లేకపోతే ఏ విద్యుత్ శాఖ వాళ్ళో మరొకరో ఏదో ఒక తప్పు కనిపెట్టి ఆయనపై చర్యలు తీసుకొన్నా ఆశ్చర్యం లేదు. బహుశః ఆ ప్రయత్నంలో భాగంగానే అందరూ ఊహించినట్లే ఆయన మీద హైదరాబాద్ పోలీసులు కొత్తగా మరో మూడు కేసులు నమోదు చేసారు.

 

ఆయన చర్లపల్లి జైలు నుండి నిన్న సాయంత్రం విడుదలయిన తరువాత పోలీసుల అనుమతి లేకుండా భారీ ఊరేగింపు నిర్వహించడం, ఆ కారణంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారనే ఆరోపణలతో ఆయనపై మల్కాజిగిరి, కుషాయిగూడా పోలీస్ స్టేషన్లలో సెక్షన్స్ 341, 188, 506, 509 క్రింద కేసులు నమోదు చేసారు. ఒకవేళ రేపు సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడాన్ని సమర్ధించినట్లయితే వీటిలో ఏదో ఒక కేసుతో మళ్ళీ ఆయనని జైలుకి పంపిస్తారేమో?

 

ఇదివరకు జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలయినప్పుడు ఇంతకంటే చాలా భారీ ఊరేగింపు నిర్వహించారు. కానీ అప్పుడు ఆయనపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మాత్రం కేసులు నమోదు చేస్తున్నారు. ఏమంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక దానితో తమకు సంబంధం లేదని తెలంగాణా ప్రభుత్వం వాదించవచ్చును. కానీ  ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇటువంటివి జరిగినప్పుడు ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. కానీ వారు కూడా అప్పుడు దానిని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం పట్టించుకొంటున్నారు? ఎందువల్ల?

 

రేవంత్ రెడ్డిపై ఇటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పూనుకొన్న తెలంగాణా ప్రభుత్వమే ఆయనను 'తెలంగాణా హీరో'గా ఎదిగేందుకు తోడ్పడిందని తెదేపా నేతల వాదనలో ఎంతో కొంత నిజం లేకపోలేదు. రేవంత్ రెడ్డి ఈ కేసులో దోషా నిర్దోషా అనే విషయాన్ని పక్కనబెట్టి చూస్తే తెలంగాణా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నందుకే ఆయనను ఈకేసులో ఇరికించారని సామాన్య ప్రజలు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఆ కారణంగా ప్రజలలో ఆయన పట్ల కొంత సానుభూతి ఏర్పడింది. ఆ కేసు సంగతి తేలక ముందే ఇప్పుడు మళ్ళీ మరో మూడు కేసులు నమోదు చేయడంతో తెలంగాణా ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఆయనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే భావన ప్రజలలో వ్యాపించేందుకు అవకాశం కలుగుతోంది. తెలంగాణా ప్రభుత్వం ఆశిస్తున్నది ఒకటయితే జరుగుతున్నది మరొకటి.