గోదావరి తల్లికి ఘనంగా కృతజ్ఞత

 

అన్నం పెట్టే అమ్మకి కృతజ్ఞతలు చెప్పడం మానవధర్మం. ఈ ధర్మాన్ని గుర్తు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. గోదావరి తల్లి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల్ని తన బిడ్డల్లా కాపాడుకుంటూ వస్తోంది. ఆ తల్లి దయవల్ల ఎన్నో జీవితాలు నిలబడుతున్నాయి. మహారాష్ట్ర పుట్టిల్లు అయిన గోదావరి తల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెట్టినింటికి చేరుతూ వుంటుంది. పుట్టింటి నుంచి మెట్టినింటికి చేరే మధ్యలో ఎన్నో జీవితాలను వెలిగిస్తోంది. నీటితో దీపాలు వెలగడం అంటే ఇదేనేమో. అలాంటి అమ్మకి కృతజ్ఞతలు చెప్పుకోవడం అందరి బాధ్యత. గోదావరి సముద్రుడిలో కలిసేముందు గోదావరికి ప్రతి నిత్యం హారతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం, ఆ కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించడం అభినందనీయమైన విషయం. తన బిడ్డలు తనకు ప్రతినిత్యం హారతి ఇస్తూ ఘనంగా వీడ్కోలు పలుకుతూ వుంటే ఆ తల్లి ఎంతగా సంతోషిస్తుందో... తన బిడ్డలను ఇంకా ఎంత బాగా ఆదరిస్తుందో. గోదావరి మూడు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. అయితే ఆ గోదావరి తల్లి పేరును పెట్టుకున్న జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వున్నాయి. ఆ తల్లి అంటే ఈ ఆంధ్రజాతికి అంత ప్రేమ. ఆ ప్రేమను చాటుకునే అవకాశం, ఘనంగా కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం దక్కిన ఏపీ ప్రజలు ధన్యులు.