డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం
posted on Mar 27, 2025 3:45PM

నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గాల పునర్విభజన కారణంగా కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసిన రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. జనాభా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయని, ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేదని తెలిపారు. ప్రస్తుతం పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరుగుతోందని, అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి అన్నారు. లోక్ సభలో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలని, అయితే రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 119 నుంచి 153కు పెంచాలని కోరారు. అలాగే జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాల్సిన అవసరముందన్నారు.
ఇక డీలిమిటేషన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఏంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. మాజీ ప్రధాని వాజ్ పేయి కూడా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకించారని గుర్తు చేశారు. ప్రస్తుతం లోక్ సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిథ్యం ఉందనీ, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ ప్రాతినిథ్యం 19 శాతానికి పడిపోతుందన్నారు.