అణ్వాయుధ వ్యాపారంలోకి భారత్‌

 

1974.... అప్పటికి భారత దేశం ఇంకా అభివృద్ధి వైపు తప్పటడుగులు వేస్తోంది. కానీ అకస్మాత్తుగా అణుబాంబుని పరీక్షించి ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. అణురంగంలో భారత్‌ సామర్థ్యాన్ని చూసిన ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. వెంటనే అణ్వాయుధాలకు అవసరమైన వనరులను పరిమితం చేసేందుకు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అదే ‘న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌’ - NSG. ఏడు దేశాలతో మొదలైన ఈ సంఘం ఇప్పుడు 48 సభ్య దేశాలతో విస్తరించింది. ఈ సంఘంలో సభ్యత్వం ఉన్న దేశాలు పరస్పరం అణ్వాయుధాలకు సంబంధించిన వ్యాపారాన్ని సాగిస్తూ ఉంటాయి. ఇందులో సభ్యత్వం లేని దేశాలకు అణ్వాయుధాలను సరఫరా చేసేందుకు నిరాకరిస్తూ ఉంటాయి. కానీ ఈ దేశాల సహాయసహకారాలు ఏవీ లేకుండానే మన దేశం అణ్వస్త్ర పరీక్షలలో దూసుకుపోయింది. 1998లో పోఖ్రాన్‌లో మరోమారు అణుపరీక్షలను నిర్వహించి తన సత్తాను చాటుకుంది. ఇక భారతదేశాన్ని నిలువరించడం సాధ్యం కాదని NSGకి తేలిపోయింది. కాబట్టి ఒకప్పుడు మన దేశానికి వ్యతిరేకంగా రూపొందిన అదే సంఘం ఇప్పుడు భారత్‌ను తనలో చేర్చుకునేందుకు సిద్ధపడుతోంది. దీనికి అమెరికా, రష్యా వంటి అగ్ర రాజ్యాల మద్దతు ఎలాగూ ఉంది.

 

మొన్నటి వరకూ ఈ విషయం మీద చిటపటలాడుతూ వచ్చిన చైనా కూడా ఇప్పుడు మెత్తబడే పరిస్థితి కనిపిస్తోంది. ఇక భారత్‌ కనుక NSGలో సభ్యత్వాన్ని పొందితే ఆయుధపోటీ పెరిగిపోతుందన్న పాకిస్తాన్ వాదనను కూడా అమెరికా కొట్టిపారేసింది. భారత్‌ను చేర్చుకుంటోంది ఆయుధపోటీ కోసం కాదనీ, అణుశక్తిని శాంతియుతమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం కోసమే అంటూ భారత్‌ను వెనకేసుకు వచ్చింది. అమెరికా చెబుతున్నదానిలో కొంత నిజం లేకపోలేదు. అణుధార్మికత ఉన్న పదార్థాలతో ఆయుధాలే కాదు, అణువిద్యుత్తుని కూడా ఉత్పత్త చేసుకోవచ్చు. అయితే అమెరికా ఈ విషయంలో భారత్‌ను వెనకేసుకురావడానికి ఆ ‘శాంతియుతమైన’ ప్రయోజనాలే కారణం కాదు! భారత్‌ శక్తివంతమైన ఆయుధ కొనుగోలుదారునిగా మారడంతో, మన దేశంతో ఆయుధవ్యాపారాన్ని కొనసాగించేందుకే అమెరికా ఈ వ్యవహారంలో మనకు మద్దతిస్తోంది. పైగా NSGలో సభ్యత్వం ఉన్న దేశాలు మిగతా సభ్య దేశాలకు తమ అణు సంపత్తి గురించి ఎప్పటికప్పుడు జవాబుదారీగా ఉండాలి. కాబట్టి అణురంగంలో దూసుకుపోతున్న భారత్‌ మీద ఒక కన్ను వేసేందుకు కూడా ఈ సభ్యత్వం ఉపయోగపడుతుంది. అంతేకాదు! మున్ముందు మన దేశం నుంచి అణ్వస్త్రాలకు, అణువిద్యుత్తుకు అవసరమైన ముడిసరుకును దిగుమతి చేసుకునే అవకాశం చిక్కుతుంది. అమెరికా ఇంత ముందుచూపుతో ఆలోచిస్తోంది కాబట్టే.. పాకిస్తాన్‌ చేస్తున్న వాదనలను సైతం లెక్కచేయకుండా భారత్‌ను NSGలోకి ఆహ్వానిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu