స్కిల్ కేసులో బాబుకు బెయిలు
posted on Nov 20, 2023 2:22PM
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట దక్కింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిలు మంజూరు చేసింది. స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 17న తీర్పు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. రిజర్వ్ చేసిన తీర్పును సోమవాంర (నవంబర్ 20)న వెలువరించింది. ఈ బెయిల్ పిటిషన్ పై చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాడీవేడి వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. రాజకీయం చంద్రబాబును వేధించడమే లక్ష్యంగా ఆయనపై ఈ కేసు బనాయించారని, ప్రభుత్వం చెప్పినట్లుగా ఏపీ సీఐడీ వ్యవహరిస్తోందని చంద్రబాబు తరఫున న్యాయవాదులు వాదించారు. వాస్తవాలను దాచిపెట్టి అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని కోర్టులో వాదనలు వినపించారు.
మరో వైపు చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ నిబంధనల్ని ఉల్లంఘించారని సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనతో ఏకీభవించి బెయిలు మంజూరు చేసింది.