రాజయ్య ఎమ్మెల్యే సీటుకీ టెండర్?
posted on Jan 28, 2015 11:12AM

ఇటీవలే పదవీచ్యుతుడైన టీఆర్ఎస్ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు కేసీఆర్ మరో షాక్ ఇవ్వబోతున్నారా? ఈ షాక్‌కి సంబంధించిన గుసగుసలు టీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున రాజయ్య అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో ఈ స్థానం నుంచి రాజయ్య, కడియం శ్రీహరి పోటీపడేవారు. ఒకసారి రాజయ్య చేతిలో కడియం శ్రీహరి ఓడిపోయారు కూడా. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండటంతో రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీకి, కడియం శ్రీహరి వరంగల్ పార్లమెంట్‌కి పోటీ చేసి గెలిచారు. తాజా రాజకీయ పరిణామాలలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి పీకేసి, ఆ పదవిని కడియం శ్రీహరికి ఇచ్చారు. మరి కడియం శ్రీహరి వరంగల్ పార్లమెంట్ సభ్యుడు. ఆయన ఆరు నెలల లోగా అసెంబ్లీకి ఎన్నికవ్వాలి. తెలంగాణలో ఇప్పుడు ఏ అసెంబ్లీ స్థానమూ ఖాళీగా లేదు. మరి ఇప్పుడేం చేయాలి? ఎవరో ఒక ఎమ్మెల్యే తన పదవిని త్యాగం చేస్తే ఆ స్థానంలో కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఓ పనైపోతుంది. మరి ఆ త్యాగం కూడా వేరే ఎవరో ఎందుకు... రాజయ్య చేతే త్యాగం చేయించాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాజయ్యను రాజీనామా చేయించి, ఆ స్థానం నుంచి కడియం శ్రీహరిని పోటీకి దింపనున్నట్టు సమాచారం అందుతోంది. ఇదే జరిగితే పాపం రాజయ్య ఎమ్మెల్యే స్థానానికి కూడా టెండర్ పెట్టేసినట్టే అవుతుంది.