జగన్ హయాంలో పడకేసిన పారిశ్రామిక రంగం ఇప్పుడు పరుగులు
posted on Mar 27, 2025 2:51PM
.webp)
ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. ఐదేళ్లు ప్రజలకు నరకం చూపించాడు. ఇక ప్రతిపక్ష నేతల గురించి చెప్పాల్సిన పనిలేదు. జగన్ కక్షపూరిత రాజకీయాల వల్ల చంద్రబాబుతో సహా అనేకమంది జైళ్లకు వెళ్లాల్సి వచ్చింది. ఆ పార్టీలోని కొందరు నేతలు వైసీపీ హయాంలో హద్దులు మీరి ప్రవర్తించారు. బూతులతో చంద్రబాబు, పవన్, లోకేశ్ సహా వారి కుటుంబ సభ్యులపైనా విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు కుటుంబాన్ని దారుణంగా అవమానించారు. అంతేనా అంతకు ముందున్న చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పలు పరిశ్రమలను తన విధానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ దణ్ణం పెట్టి మరీ తరలిపోయేలా చేశారు. అలా జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు సంగతి అలా ఉంచి.. ఉన్న పరిశ్రమలే తరలిపోయే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది.
ఇక ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేవం కూటమి అధికార పగ్గాలు చేపట్టడంతో పరిశ్రమల రంగానికి మహర్దశ పట్టింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయ్యింది. ఈ తొమ్మిది నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ కు ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో కొన్ని ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత రాష్ట్యరానికి కొత్త కంపెనీలు వస్తున్నాయి. అదే సమయంలో గతంలో జగన్ దాష్టీకం, అస్తవ్యస్థ, అరాచక విధానాల కారణంగా రాష్ట్రం నుంచి తరలిపోయిన కంపెనీలు కూడా తిరిగి వస్తున్నాయి. ఇలాంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసింది లాలూ గ్రూపు గురించి.
గతంలో అంటే 2014-2019 వరకూ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నారు. అప్పట్లో విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ ఏర్పాటుకు సుప్రసిద్ధ వ్యాపార దిగ్గజం లాలూ గ్రూప్ ముందుకు వచ్చింది. ఇందు కోసం అప్పటి చంద్రబాబు సర్కార్ ఆ కంపెనీకి భూమిని కేటాయించింది. ఏపీఐఐసీ ద్వారా సదరు భూమిని స్వాధీనం చేసుకున్న లులూ షాపింగ్ మాల్ నిర్మాణ పనులకు రంగం సిద్ధం చేసింది. ఈ లోగా 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేతపట్టారు. అంతే.. వైసీపీ పాలనలో లులూకు అంతగా ప్రోత్సాహం లభించడం సంగతి అటుంచి వేధింపులు మొదలయ్యాయి. దీంతో లులూ గ్రూప్ తన ప్రాజెక్టును రద్దు చేసుకుని రాష్ట్రం విడిచి వెళ్లిపోయింది. ఆ ప్రాజెక్టును ఆ సంస్థ హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది.
ఇక ప్రస్తుతానికి వస్తే గత ఏడాది జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో ఏపీలో పారిశ్రామిక రంగం దశ తిరిగింది. దేశ విదేశాల నుంచి దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి క్యూకట్టడం ప్రారంభమైంది. చంద్రబాబు అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం పెట్టుబడి దారులను ఆకర్షిస్తున్నది. దీంతో లులూ గ్రూపు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా లులూకు స్వాగతం పలికారు. జనవరిలో లులూ గ్రూప్ చైర్మన్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో గతంలో అనుకున్నట్లుగానే విశాఖలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ ను ఏర్పాటు లులూ చైర్మన్ ప్రతిపాదించగా, చంద్రబాబు వెంటనే ఓకే చెప్పారు. అంతే కాకుండా గతంలో లులూకు కేటాయించిన భూమిని తిరిగి కేటాయిస్తూ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో తీర్మానం చేశారు. దీంతో నాడు జగన్ కారణంగా తరలిపోయిన లులూ తిరిగి రాష్ట్రంలోనికి అడుగుపెడుతున్నది.