జాతీయ హోదా వస్తేనే పండగ కాదు...
posted on May 2, 2015 11:41AM
మన తెలుగులో ఒక మంచి సామెత వుంది... ఇల్లలకగానే పండగ కాదు అని... ఈ సామెత నుంచి ప్రతి తెలుగువారు పాఠాన్ని నేర్చుకోవచ్చు... ఇప్పుడు జాతీయ హోదాను సాధించాలని ఉవ్విళ్ళూరుతున్న తెలుగుదేశం పార్టీ కూడా ఈ సామెత నుంచి పాఠాన్ని నేర్చుకోవలసిన అవసరం వుంది. మూడు దశాబ్దాల క్రితం విస్తరించి, తెలుగు ప్రజల జీవితంలో మమేకం అయిపోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో విస్తరించి వుంది. ఇంకా మరో రెండు రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేసి తెలుగుదేశం పార్టీకి జాతీయ పార్టీ హోదా పొందాలన్న ఆలోచనలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువ నేత నారా లోకేష్ వున్నారు. అయితే, ఇల్లలకగానే పండగ కాదన్నట్టుగా... పార్టీ అభివృద్ధి చెంది, మరింత అభ్యున్నతిలోకి వెళ్ళాలంటే కేవలం జాతీయ పార్టీ హోదా వస్తే చాలదు... పార్టీ ఆలోచనలలో కొత్తదనం రావాలి, పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం పెరగాలి, కొత్త ఆలోచనలలో, కొత్త రక్తంతో ముందుకు దూసుకువెళ్ళాలి... అప్పుడే పార్టీకి సరైన పండగ.
తెలుగుదేశం పార్టీ ముందు ఇప్పుడు అనేక సవాళ్ళు వున్నాయి. తెలుగుదేశం పార్టీ మీద ఎంతో నమ్మకంతో అధికారం అప్పగించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభ్యున్నతి పథంలో నడిపించాలి. అధికారం కోల్పోయి, ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ బారి నుంచి కాపాడుకునే పరిస్థితిలో వున్న తెలంగాణ రాష్ట్రంలో పుంజుకోవాలి... మళ్ళీ అధికారాన్ని సంపాదించాలి. అయితే లక్ష్యాలు భారీగా వున్నాయి. పార్టీని అ లక్ష్యాలకు చేర్చేవారే తక్కువగా వున్నారు. పల్లకినీ ఎక్కేవారే తప్ప, మోసేవారు తక్కువగా వున్నారు. అదే పార్టీకి పెద్ద సమస్య. పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు లోకేష్ పార్టీ కోసం రోజుకు 20 గంటలు శ్రమిస్తున్నారు. అయితే వారిద్దరి శ్రమ సరిపోతుందా... వారు రోజుకు 20 గంటలు పనిచేస్తుంటే, వారు పదవులిచ్చి ప్రోత్సహించినవారు మాత్రం రోజుకు రెండు గంటలు కూడా పనిచేయలేని పరిస్థితిలో వున్నారు. ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో పదవులు పొందిన చాలామంది చంద్రబాబు వేగాన్ని అందుకోలేక చతికిలపడ్డారు. ఇతర పార్టీల నుంచి గోడదూకి వచ్చినవారు, వయసు మళ్ళినవారు, దర్జాగా తిరగడమే తప్ప చెమటోడ్చడం తెలియనివారు, పాత చింతకాయ పచ్చడి లాంటి నాయకులు, మా తాతలు నేతులు తాగారని చెప్పుకుంటూ ఆ వారసత్వంతో పదవులు పొందిన నాయకులు... ఇలాంటి తాలు విత్తనాలు పదవుల్లో దర్జా వెలగబెడుతున్నారు. తాలు విత్తనాలతో పంట పండుతుందా? ఇలాంటి వారిని నమ్ముకుని పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలని అనుకుంటే దేనితోకో పట్టుకుని గోదారి ఈదాలని అనుకోవడమే అవుదా?
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నడిపిన బాటలో పార్టీని నడపటమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ‘శ్రీరామరక్ష’ అవుతుంది. పాతతరం నాయకులనే నమ్మకుని, వారికే బాధ్యతలు అప్పగించే పొరపాటు ఇప్పుడు అలవాటుగా మారింది. ముఖ్యంగా దాన్ని మార్చుకోవాలి. ఎన్టీఆర్ కొత్తతరం నాయకులను ఎంతో ప్రోత్సహించేవారు. చురుకైన, ఉత్సాహవంతులైన, పార్టీకోసం ప్రాణంపెట్టే యువ నాయకులను పదవులిచ్చి ప్రోత్సహించేవారు. ఆయన ప్రోత్సహించిన వారే ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయంగా ఉన్నత స్థానాల్లో వున్నారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఉత్సాహవంతులైన, ప్రతిభావంతులైన కార్యకర్తలు, నాయకులకు కొదువ లేదు. అలాంటి వారి సేవలను వినియోగించుకోవాలి. వారి పనితీరును, పాతతరం నాయకుల పనితీరును బేరీజును వేసుకుంటే ఇంతకాలం ఈ విషయంలో పార్టీ చేసిన పొరపాటు ఏమిటో అర్థమవుతుంది. పార్టీ నాయకత్వం ఇంతకాలం చేసిన పొరపాటును సరిదిద్దుకుని కొత్తరక్తాన్ని ఉపయోగించుకుంటే తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిని పొందడమే కాదు... మరోసారి జాతీయ స్థాయిలో తన సత్తాను చాటే అవకాశం వుంటుంది.