కార్పొరేటర్ల పిచ్చకొట్టుడు.. అమ్రపాలి షాక్!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్పొరేటర్ల సమావేశం శనివారం నాడు జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్,బీఆర్ఎస్, ఎంఐఎం కార్పొరేటర్లు సమానంగా ఆవేశం ప్రదర్శించి ఒకరినొకరు పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. ఎవర్ని ఎవరు కొడుతున్నారో తెలియనంతగా ఒకరిమీద మరొకరు పడి కొట్టుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు వీరబాదుడు బాదుకుంటున్న కార్పొరేటర్లను కంట్రోల్ చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రయత్నించారు. వాళ్ళని కంట్రోల్ చేయడం తనవల్ల కాకపోవడంతో మీటింగ్ హాల్‌ని వదిలి వెళ్ళిపోయారు. కొత్తగా జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి అమ్రపాలి ఈ వీరబాదుడు కార్యక్రమం చూసి షాకైపోయారు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తనది కాకపోవడంతో ఆమె దారిన ఆమె వెళ్ళిపోయారు. ఈరోజు ఉదయం కార్పొరేటర్ల సమావేశం ప్రారంభమైనప్పటి నుంచే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కార్పొరేటర్లు యుద్ధానికి సిద్ధం అన్నట్టుగానే ప్రవర్తిస్తూ వచ్చారు. కొత్త కమిషనర్ అమ్రపాలి కార్పొరేటర్లను ఉద్దేశించి కూర్చునే మాట్లాడారు. దాంతో కార్పొరేటర్లు చాలా సీరియస్ అయ్యారు. ఆమె నిల్చుని మాట్లాడాలని డిమాండ్ చేశారు. దాంతో అమ్రపాలి నిల్చుని మాట్లాడారు. జోనల్ కమిషనర్లు కూడా నిల్చుని మాట్లాడి, తమను తాము పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత కార్పొరేటర్ల మధ్య మాటామాటా పెరిగి, కొట్లాటకు దిగారు. ఈ బాదుడు కార్యక్రమం ఎంత కంట్రోల్ చేసినా తగ్గకపోవడంతో మేయర్ విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి సమావేశం నుంచి వెళ్ళిపోయారు.