లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓమ్ బిర్లా!

లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓమ్ బిర్లా  ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్‌గా ఓమ్ బిర్లా ఎన్నిక కావడం ఇది రెండోసారి. బుధవారం నాడు జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేష్ మీద విజయం సాధించారు. లోక్‌సభ స్పీకర్ పదవికి 48 సంవత్సరాల తర్వాత ఎన్నిక జరగడం ఇదే మొదటిసారి. లోక్‌సభ స్పీకర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకునే విషయంలో అధికార కూటమి, ప్రతిపక్ష పార్టీల కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక జరగడం అనివార్యం అయింది. 

బుధవారం లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. స్పీకర్‌గా ఓమ్ బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్‌నాథ్‌సింగ్‌తో సహా పలువురు ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. మరోవైపు ఇండియా కూటమి తరఫున కె.సురేష్ పేరును శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం ప్రవేశపెట్టగా, పలువురు ఇండియా కూటమి ఎంపీలు బలపరిచారు. ఆ తర్వాత మూజువాణి ఓటింగ్ నిర్వహించిన ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ స్పీకర్‌గా ఓమ్ బిర్లా విజయం సాధించినట్టు ప్రకటించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెంటరాగా ఓమ్ బిర్లా స్పీకర్ స్థానంలో కూర్చున్నారు. స్పీకర్‌గా మరోసారి ఎన్నికైన ఓమ్ బిర్లాను పార్లమెంట్ సభ్యులు అభినందించారు.