అమెరికాలో అంతే..!

అమెరికాలో ఒక తల్లి.. నలుగురు పిల్లలతో కలసి రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఒక ఊహించని సంఘటన జరిగింది. ఆ నలుగురు పిల్లలూ ఒక మ్యాన్‌హోల్లో పడిపోయారు. దాంతో ఆ తల్లి విలవిలలాడిపోయింది. సహాయం కోసం తల్లడిల్లిపోయింది. ఆ తల్లి బాధని అక్కడున్నవాళ్ళు చూశారు. వెంటనే స్పందించారు. ఫైర్ ఫైటర్స్.కి ఫోన్ చేశారు. ఫైర్ ఫైటర్స్ మెరుపు వేగంతో వచ్చారు. ఒక్కళ్లు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు వచ్చారు. వీళ్ళే కాకుండా ఇద్దరు పోలీసులు కూడా వచ్చారు. వచ్చిన వెంటనే ఫైర్ ఫైటర్స్ ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా మాన్‌‌హోల్లోకి దిగారు. నలుగురు పిల్లల్నీ కాపాడారు. థాంక్‌గాడ్... నలుగురు పిల్లలకీ ఏమీ కాలేదు.. చాలా సేఫ్‌గా వున్నారు. పరుగు పరుగున తల్లి దగ్గరకి వెళ్ళారు. పిల్లలు క్షేమంగా బయటపడేసరికి ఆ తల్లి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. తన పిల్లల్ని కాపాడిన ఫైర్ ఫైటర్స్ వైపు కృతజ్ఞతగా చూసింది. ఆనందంగా తోక ఊపింది. అంతా బాగానేవుంది కానీ, ఈ తోక ఊపడం ఏంటీ అనుకుంటున్నారా? ఆ తల్లి ఎవరో కాదు.. బాతు.. ఫైర్ ఫైటర్స్ కాపాడింది మరెవర్నో కాదు.. బాతు పిల్లల్ని. అమెరికాలో అంతేనండీ... ఎవర్ని కాపాడ్డానికైనా రెడీగా వుంటారు.