నా కూతురు కన్నీళ్లు మిమ్మల్ని ముంచేస్తాయి: రేణు దేశాయ్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్ పట్ల పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆవేదన చెందుతున్నారు. 
‘‘మీకూ ఓ కుటుంబం ఉంది. అందులో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుపెట్టుకోండి. నా కుమార్తె కన్నీళ్లు కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడతాయి జాగ్రత్త’’ అని రేణుదేశాయ్ హెచ్చరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల తన భార్య లెజినోవా, పిల్లలు అకీరానందన్, ఆద్యతో సరదగా దిగిన ఫొటో వైరల్ అయింది. 
ఈ ఫొటోను ఉపయోగించి రేణుదేశాయ్‌ను అవమానించేలా కొందరు మీమ్స్ రూపొందించారు. వీటిపై స్పందించి రేణు.. కొందరిని చూస్తుంటే అసహ్యం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫొటోను తాను ఏ విధంగా క్రాప్ చేస్తానని, ఎలా పోస్టు చేస్తానని పేర్కొంటూ మీమ్స్, జోక్స్ వేశారని పేర్కొన్నారు. 
మీకూ ఓ కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. తన తల్లిని ఎగతాళి చేసేలా ఉన్న ఒక పోస్టును చూసి నా కుమార్తె విపరీతంగా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులను ఎగతాళి చేసే మీకూ ఇంట్లో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోండి. మీలాంటి వ్యక్తులను చూస్తుంటే అసహ్యమేస్తోంది. ఇలాంటి మీమ్ పేజీలు నిర్వహించేవారు భయంకరమైన వ్యక్తులు. ఈ తల్లి శాపం మీకు తప్పనిసరిగా తగులుతుంది. ఈ పోస్టు చేయడానికి వందలసార్లు ఆలోచించాను. నా కుమార్తె కోసం, ఆమె అనుభవించిన బాధను దృష్టిలో పెట్టుకుని ఈ పోస్టు చేస్తున్నాను’’ అని రేణుదేశాయ్ ఆ పోస్టులో పేర్కొన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అనా లెజినోవా, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో కలిసి దిగిన అందమైన ఫొటోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేసిన తర్వాత క్లిక్‌మనిపించిన ఫొటో ఇదని జనసేన పార్టీ తెలిపింది. ప్రమాణం చేసిన తర్వాత మంగళగిరిలోని నివాసానికి బయల్దేరామనుకుంటే.. ట్రాఫిక్‌ కారణంగా ఇబ్బందులు తలెత్తాయని, దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపిన జనసేనాని.. కాసేపు సేదతీరారని జనసేన పార్టీ తెలిపింది. ఈ సమయంలోనే భార్య అనా లెజినోవా, పిల్లలు అకీరా, ఆద్యలతో తీసుకున్న ఫొటో ఇది అంటూ అందమైన ఫొటో వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యాన్ని బయటపెట్టింది.