వాటి పై లవ్వెక్కువైతే... లావైపోతారట!
posted on Dec 16, 2016 1:58PM

మీరు బాగా లావైపోయారా? దీనికి కారణం ఏంటో అర్థం కావటం లేదా? ఎంతగా డైటింగ్ చేసినా కూడా ఒళ్లు తగ్గటం లేదా? పోనీ... రాత్రి పూట అన్నం మానేసి, పొద్దున్నే యోగా, ఎక్సర్సైజ్ లు చేస్తున్నా పెద్దగా ఫలితం వుండటం లేదా? అయితే, మీరు వెంటనే ఓ పని చేయాలి. అప్పుడు ఇక పాత పర్ఫెక్ట్ ఫిగర్, ప్లాట్ టమ్మీ... మీవి మీకు తిరిగొచ్చేస్తాయి! ఇంతకీ ఏంటా స్లిమ్ అండ్ సెక్సీ సీక్రెట్ అంటారా? మీ ఎలక్ట్రానిక్ డివైజెస్!
ఆధునిక కాలంలో ఇంటి నిండా పరికరాలే! చేతి నిండా స్మార్ట్ టెక్నాలజీనే! ఇప్పుడు ఈ టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్లే కొంప ముంచుతున్నాయట! గోడకు తగిలించే ఎల్సీడీ టీవీలు మొదలు చేతిలో పట్టుకునే స్మార్ట్ ఫోన్ వరకూ అన్నీ ఉబకాయానికి ఊతమిస్తున్నాయట. ఎలా అంటే, టీవీలు, ఫోన్ లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ మనిషి మనస్సుపై ఒత్తిడి పెంచుతున్నాయి. కళ్లపై కూడా ప్రభావం చూపుతున్నాయి. అసలు అమెరికాలో చేసిన ఒక సర్వే ప్రకారం రోజుకు 5గంటల కంటే ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ వాడుతున్న యువత సరిగ్గా నిద్ర కూడా పోవటం లేదట. ఇక ఆహారం కూడా ఈ పరికరాల దెబ్బకు అదుపు తప్పుతోందట!
మామూలు వారికంటే ఫోన్ లు ఎక్కువగా వాడేవారు, టీవీ ఎక్కువగా చూసేవారు, కంప్యూటర్ ముందు చాలా సేపు కూర్చునే వారు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా వుందంటున్నారు నిపుణులు. చక్కెర ఎక్కువగా వుండే ఆహారాలు, పానీయాలు వీరు విపరీతంగా అలవాటు చేసుకుంటున్నారట. టీవీ, కంప్యూటర్ లాంటివి చూస్తూ ఎంత తాగుతున్నారో, తింటున్నారో అంచన లేక ఎక్కువే లాగించేస్తున్నారు. దీని వల్ల కూడా జబర్దస్త్ గా వుండాల్సిన ఫిగర్ కాస్తా బస్తాలా మారిపోతోంది...
సో... లావైపోయిన వారు కేవలం తిండి తగ్గిస్తేనో, ఆరోగ్యకరమైన ఆహారం తింటేనో బరువు తగ్గిపోరు. వాటితో పాటూ వెలుగులు విరజిమ్మే ఎలక్ట్రానిక్ తెరల్ని సాధ్యమైనంత తక్కువ సేపు చూడాలి. అది టీవీ అయినా, కంప్యూటరైనా, స్మార్ట్ ఫోనైనా... అవసరానికి మించి చూస్తూ కూర్చుంటే... మనకు మనం అద్దంలో చూసుకోబుద్ది కానంత షేపవుట్ అవ్వటం గ్యారెంటీ...