ఇద్దరు ప్రెసిడెంట్లు... రెండు దేశాలతో పేచీలు పెట్టుకుంటున్నారు!


అమెరికా పరిస్థితి విచిత్రంగా వుందిప్పుడు! ఆ దేశానికి ఇద్దరు ప్రెసిడెంట్లు కొనసాగుతున్నారు. ఒబామా ఇంకా దిగిపోలేదు. కాని, ట్రంప్ ఎన్నికైపోయాడు. ఒక వైపు ఒబామా తనదైన స్టైల్లో ప్రెసిడెంట్ గిరి ఇంకా చేస్తుండగానే ట్రంప్ కూడా ప్రపంచం మీద పడిపోయి ఫోన్ కాల్స్ చేసేస్తు సంచలనాలు సృష్టిస్తున్నాడు! అమెరికా తరువాత అంతటి శక్తివంతమైన దేశాలైన రష్యా, చైనాలతో వివాదాల్ని రాజేసుకుంటున్నారు ఇద్దరు ప్రబుద్ధులు...

 

ట్రంప్ తైవాన్ విషయంలో చేసిన ఘనకార్యం మనకు తెలిసిందే. ఆయన ఎప్పుడూ లేనిది ఆ దేశ అధ్యక్షురాలితో ఫోన్ లో మాట్లాడారు. తమ దేశానికి పర్యటన కోసం రమ్మన్నారు. ఇది తైవాన్ ను ఇప్పటికీ ప్రత్యేక దేశంగా గుర్తించని చైనాకు మంట పుట్టించింది. తైవాన్ తమ భూభాగమే అని దబాయించే డ్రాగన్ అమెరికాపై నిప్పులు కక్కుతోంది! ఇది అమెరికా భవిష్యత్ అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారమైతే ప్రస్తుత ప్రెసిడెంట్ ఒబామా కూడా వెళుతూ వెళుతూ తన సత్తా ఏంటో చూపించి వెళతానంటున్నాడు!

 

ఒబామాది డెమోక్రాటిక్ పార్టీ. హిల్లరీ కూడా డెమొక్రాటే. అయితే, మొన్న జరిగిన ఎన్నికల్లో ఆమె గెలుస్తుందని అంతా చెప్పినా అనూహ్యంగా ట్రంప్ గెలిచాడు. ఈ విషయమే హిల్లరీ స్వంత పార్టీ వాడైన ఒబామాకు ఇంకా మింగుడుపడటం లేదు. తమ అభ్యర్థిని ఓడించటానికి రష్యా కుట్ర చేసిందంటున్నాడు. పుతిన్ స్వయంగా తమ సర్వర్లపై దాడులు చేయించాడని ఆయన నిర్ధారణకొచ్చేశాడు. అంతే కాదు, తమ ఇంటలిజెన్స్ ఏజెన్సీలు త్వరలోనే రిపోర్ట్ ఇస్తాయని, అప్పుడు నేరుగా రష్యాపై దాడులు చేస్తామని అంటున్నాడు. కాని, ఒబామా వద్ద మిగిలింది చాలా తక్కువ రోజులే. అంతలోనే రష్యా తమ ఎన్నికల్ని ప్రభావితం చేసిందని నిరూపించి దాడులకి దిగాలని ఆయన ఆలోచన! కాని, అదంత ఈజీ ఏం కాదు.నెక్స్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అంగీకరించాలి. కాని, అసలు పుతిన్ అమెరికా ఎన్నికల్ని ఇన్ ఫ్లుయెన్స్ చేయటం ఆయనకు ముందు నుంచే తెలుసు. అందువల్లే ఆయన గెలిచాడు కూడా! మరిక ఒబామాకు ఆయన ఎందకు సహకరిస్తాడు?

 

నిజంగా రష్యా అమెరికాఎన్నికల్ని ప్రభావితం చేసినా కూడా ఆ దేశంపై అగ్ర రాజ్యం మిలటరీ దాడుల దాకా వెళ్లకపోవచ్చు. అదీ దిగిపోతోన్న ఒబామా ఆదేశాల మీద అస్సలు చేయకపోవచ్చు. కాని, రష్యాతో గొడవంతా టీ కప్పులో తుఫాన్ అయినా తైవాన్ విషయంలో చైనాతో ట్రంప్ పెట్టుకున్న పేచి ఇప్పుడే తెగేలా లేదు! ఆయన ఇంకా నాలుగేళ్లు వైట్ హౌజ్ లో వుంటాడు కాబట్టి డ్రాగన్ కు ఏదో ఒక విధంగా సెగ తగలటం, అది తిరిగి అమెరికాకు గట్టిగా బదులివ్వటం అనివార్యం అంటున్నారు ఇంటర్నేషనల్ రిలేషన్ ఎక్స్ పర్ట్స్!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu