గోవధ... గోవా... ఇంతకీ, గోపాలుడి గోలేంటి?  


పవన్ తెలిసి చేస్తున్నాడో... తెలియక చేస్తున్నాడోగాని... రిస్కీ రాజకీయమే చేస్తున్నాడు. ఇలా ఎందుకు అనాల్సి వస్తోందంటే ఒకవైపు సినిమాలు చేస్తూ ఇంకా ఫుల్ టైం పొలిటీషనే కాలేదు. కాని, ట్విట్టర్ వేదికగా, ఢిల్లీని పాలిస్తోన్న అతి పెద్ద పార్టీని టార్గెట్ చేస్తున్నాడు. దీని వల్ల ఆయన అశిస్తుందేంటో ఎంతకీ అర్థం కావటం లేదు. ఈ మాట అంటోన్నది మామూలు జనమే కాదు రాజకీయ విమర్శకులు కూడా...


పవన్ కళ్యాణ్ 2014లో మోదీ, చంద్రబాబులతో కలిసి వేదికలు పంచుకున్నాడు. అప్పుడు కూడా బీజేపి హిందూత్వ పార్టీనే. గోవధ విషయంలో వారి స్టాండ్ ఎప్పుడూ ఒకటే. కాని, మోదీ అధికారంలోకి వచ్చాక దాద్రి ఘటన లాంటి వాటి నేపథ్యంలో కొంత గందరగోళం నెలకొంది. కాని, బీహార్ ఎన్నికల తరువాత బీఫ్ ని అందరూ మరిచిపోయారు. అటువంటి అంశం ఇప్పుడు పవన్ సంరద్భరం లేకుండా తిరగదోడుతున్నాడు. బీఫ్ ను ముందు గోవాలో బ్యాన్ చేయాలంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నాడు. కొంత వరకూ బీజేపీ గోవును, రామ మందిరాన్ని అధికారంలోకి వచ్చేందుకు వాడుకుని వుండవచ్చు. కాని, మోదీ ప్రధాని అయ్యాక గో వధ విషయం పై కేంద్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఏ రాష్ట్రంలోనూ కొత్తగా నిషేధం అమలు చేయటానికి ప్రయత్నించింది కూడా లేదు. పార్లమెంట్ లోనూ గో వధ నిషేధిస్తామని ఎవ్వరూ అనలేదు. అయినా పవన్ ఇప్పుడు బీఫ్ రాజకీయాలకు దిగటం ఆయన వ్యూహానికే అందాలి!


గో వధ విషయంలోనే కాదు, రోహిత్ వేముల ఉదంతాన్ని కూడా తిరగదోడే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది పవన్. అసలు ఇలాంటి అంశాలు సామాన్య జనానికి ఎంత వరకూ కనెక్ట్ అవుతాయి? ప్రత్యేక హోదా , నోట్ల రద్దు లాంటివైతే ఓకేగాని బీఫ్ బ్యాన్, రోహిత్ వేముల ఆత్మహత్య... వీటి వల్ల పవన్ ఏపీలో సాధించేదేమిటి? ఆయన తాజాగా కమ్యూనిస్టులతో చేతులు కలపటమే ఈ విమర్శలకి కారణమా? కొందరైతే అదేనంటున్నారు! అచ్చం కమ్యూనిస్టులు బీజేపిని విమర్శించినట్టే పవన్ కూడా కామెంట్లు చేస్తున్నాడని అంటున్నారు. అయితే, ఇక్కడ ఎవ్వరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఆంధ్రాలో బీజేపి బలం చాలా పరిమితం. అటువంటి పార్టీని టార్గెట్ చేసి వచ్చే ఎన్నికల్లో ఎంత లాభపడవచ్చు? అదికారంలో వున్న టీడీపిని తగినంతగా విమర్శించకుండా, ప్రతిపక్షంలో వున్న వైసీపి ఓట్లను తనవైపు మరల్చుకునే ప్రయత్నం చేయకుండా, ఎక్కడో ఢిల్లీలోని కమలదళాన్ని ఇక్కడ్నుంచి విమర్శిస్తే వచ్చేదేంటి? అదీ ప్రత్యేక హోదా లాంటి వాల్యూ వున్న విషయలు కూడా కాకుండా గోవధ లాంటి ఫక్తు రాజకీయ అంశాలు నెత్తికోవటం దేనికీ? లోగుట్టు అంటు ఒకటి ఏదైనా వుంటే... అది పవన్ పెరుమాళ్ల వారికే ఎరుక!

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu