ఓల్డు గోల్డుపై బోల్డుగా స్పందించిన కేసీఆర్!
posted on Dec 17, 2016 2:00PM

నోట్ల రద్దు తరువాత మోదీకి మద్దతు కరువైంది. రాహుల్, కేజ్రీవాల్, మమత బెనర్జీ అయితే రో్డ్డు మీదకొచ్చి నానా యాగీ చేశారు. మిగతా నాయకులు, సీఎంలు అంతగా అల్లరి చేయకున్నా ప్రధానిని వీలైనంత టార్గెట్ చేశారు. కాని, ఇటువంటి సమయంలో నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ నమోకి అండగా నిలిచి ఆశ్చర్యపరిచారు. అందుకే, మోదీ వాళ్లకు ధన్యవాదాలు కూడా చెప్పారు. అయితే, మొత్తం దక్షిణాదిలో ఎన్డీఏలో లేకున్నా మోదీ వైపు నిల్చిన ముఖ్యమంత్రి కేసీఆరే! అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన పీఎం వెంట అందరూ వుండాలని పిలుపునిచ్చారు. ఇది నరేంద్రడుకి నిజంగా నైతిక స్థైర్యాన్ని ఇచ్చేదే...
కేసీఆర్ నోట్లు రద్దు చేసిన వెంటనే ఏమీ స్పందించలేదు. తరువాత చిరు కోపం ప్రదర్శించారు. కాని, ప్రధాని ఆఫీస్ నుంచి ఫోన్ రాగానే ఒక్కసారే గేర్ మార్చేశారు. ఢిల్లీ వెళ్లి వచ్చాక మొత్తం టోనే మారిపోయింది. మోదీ తన భవిష్యత్ వ్యూహాలు కేసీఆర్ తో ఏం పంచుకున్నారో తెలియదుగాని తెలంగాణ సీఎం డీమానిటైజేషన్ కు నూటికి నూరు శాతం మద్దతు ప్రకటించారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో కూడా కేసీఆర్ మోదీ నిర్ణయాన్ని చారిత్రాత్మకమైందిగా అభివర్ణించారు. కాని, అంతలోనే తనదైన స్టైల్లో చిరు హెచ్చరిక కూడా చేశారు!
మోదీ నోట్లు రద్దు చేసినప్పుడు అయిన గొడవ కన్నా ఎక్కువ హంగామా బంగారం లెక్కలు తీస్తారన్నప్పుడు అయింది. దీనికి కొంత వరకూ మీడియా అల్లరి కూడా కారణం. మహిళల్ని మరీ భయపెట్టేసే సరికి చాలా మంది అపోహలకి లోనయ్యారు. దాన్నే కేసీఆర్ చర్చిస్తూ చట్టబద్ధమైన బంగారం ఎవ్వరూ తీసుకుపోరని అన్నారు. కాని, లెక్కలు చూపని నల్ల బంగారం ఖచ్చితంగా బయటకు తీయాల్సిందేనన్నారు. అయితే, వారసత్వంగా వస్తున్న బంగారం కూడా కేంద్ర ప్రభుత్వం ముట్టుకోదని చెబుతూనే... అలాంటి ప్రయత్నం చేస్తే ముందు తానే ఎదురు తిరుగుతానని ఆయన అన్నారు! నిజానికి దేశంలోని అందరూ ముఖ్యమంత్రులు కేంద్రంతో ఇలా పట్టువిడుపు ధోరణిలో పని చేస్తే నోట్ల రద్దు సమస్య ఇంత జటిలం అయ్యేది కాదని అంటున్నారు కేసీఆర్ అభిమానులు. అదీ నిజమే...