పవార్ కాలు ఫ్యాక్చర్

 

కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్  తన నివాసంలో బుధవారం ఉదయం జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. గాయపడిన శరద్ పవార్‌ని హుటాహుటిన ఎయిర్ అంబులెన్స్‌లో బ్రీచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం తన ఇంట్లోనే మార్నింగ్ వాక్ చేస్తున్న ఆయన అకస్మాత్తుగా జారి పడిపోవడంతో గాయపడ్డట్టు తెలుస్తోంది. 73 సంవత్సరాల వయసున్న శరద్ పవార్‌ కాలికి గాయమైనట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా చక్రం తిప్పిన పవార్ మూడుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి అధిష్టించారు. కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. 1999లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. మొన్నటి వరకు కేంద్రంలో యుపిఏ ప్రభుత్వానికి, మహారాష్ట్రలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన  తర్వాత బయటి నుంచి మద్దతు ఇచ్చారు. ఆయన కూతురు సుప్రియా సూలె తండ్రి రాజకీయ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.