కేంద్రప్రభుత్వం తెలంగాణాకు అన్యాయం చేస్తోందా?
posted on Nov 21, 2015 2:43PM
.jpg)
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు 1.93 లక్షల ఇళ్ళు, తెలంగాణా రాష్ట్రానికి కేవలం 10, 000 ఇళ్ళు మాత్రమే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కేటాయించడంపై తెరాస నేతలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం పట్ల మొదటి నుండి సవతి తల్లి ప్రేమ చూపుతోందని అందుకు ఇదే చక్కటి ఉదాహరణ అని వాదిస్తున్నారు. ప్రత్యక్షంగా కళ్ళకు కనబడుతున్నది కూడా అదే. కానీ కేంద్రప్రభుత్వాని నిందిస్తున్న తెరాస నేతలు, ఆ విధంగా జరగడానికి తమ ప్రభుత్వ తప్పిదం కూడా ఉందనే విషయం దాచిపెట్టి, కేంద్రప్రభుత్వంపై, బీజేపీపై విమర్శలు గుప్పిస్తుండటంతో బీజేపీ నేతలు కూడా ఆ రహస్యాన్ని బయటపెట్టక తప్పలేదు.
బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మిగిలిన అన్ని రాష్ట్రాలతో బాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఈ పధకం క్రింద ఎన్ని ఇళ్ళు అవసరం అవుతాయో వివరాలతో ప్రతిపాదనలను పంపమని కోరుతూ లేఖలు వ్రాసింది. ఆ లేఖలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కోరిన అన్ని వివరాలను చాలా రోజుల క్రిందటే సమర్పించింది. కానీ తెలంగాణా ప్రభుత్వం దీనిపై ఆఖరు నిమిషం వరకు స్పందించనే లేదు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన ప్రతిపాదనలపై చర్చించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు నవంబర్ 18న సమావేశం అవుతారనగా, తెలంగాణా ప్రభుత్వం 17వ తేదీ సాయంత్రం హడావుడిగా ప్రతిపాదనలు పంపించింది. అయినా కూడా వాటిని అధికారులు తమ అజెండాలో చేర్చి తెలంగాణా ప్రభుత్వం కోరిన విధంగానే 10,000 ఇళ్ళను మంజూరు చేసారు. అటువంటప్పుడు తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెరాస నేతలు ఏవిధంగా వాదిస్తున్నారు? కేంద్రప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తున్నారు? అంటే తమ అసమర్ధతని, తప్పుని కప్పి పుచ్చుకోవడానికేనని అర్ధం అవుతోంది. ఇప్పటికయినా తెరాస ప్రభుత్వం మేల్కొని కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అందిస్తున్న వివిధ పధకాలను, ప్రాజెక్టుల కోసం సకాలంలో ప్రతిపాదనలు పంపించి తెలంగాణా రాష్ట్రానికి మేలు చేస్తే బాగుంటుంది,” అని అన్నారు.
కిషన్ రెడ్డి చెప్పిన ప్రకారం చూస్తే, తెలంగాణా ప్రభుత్వమే తమకు 10, 000 ఇళ్ళు కేటాయించాలని కోరినట్లు అర్ధమవుతోంది. అది కూడా ఆఖరు నిమిషంలో ప్రతిపాదనలు పంపినట్లు అర్ధమవుతోంది. అయినప్పటికీ కేంద్రప్రభుత్వం దాని అభ్యర్ధన మేరకు అది కోరినన్ని ఇళ్ళు మంజూరు చేసిందని స్పష్టం అవుతోంది. కనుక ఇకనయినా అటువంటి తప్పిదాలు, నిర్లక్ష్యం జరగకుండా జాగ్రత్త పడితే మంచిది.