చంద్రబాబుకి హరిరామ జోగయ్య సలహా
posted on Nov 22, 2015 10:46AM
మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య వ్రాసిన “60 వసంతాల రాజకీయ ప్రస్తానం” అనే తన జీవిత చరిత్ర పుస్తకాన్ని విడుదల చేసినప్పటి నుండి వార్తలకు ఎక్కారు. అప్పటి నుండి తరచూ ఏదో ఒక అంశం మీద మాట్లాడుతూ మీడియా దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నారు. ఈసారి ఆయన తెదేపా దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తన అస్త్రాలు సంధించారు.
"ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ అనుచరులకు మేలు చేసే ఉద్దేశ్యంతో కేవలం రెండు జిల్లాలనే అభివృద్ధి చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో మిగిలిన జిల్లాలను అభివృద్ధి చేయడం లేదు. ఒకవేళ ఇదేవిధంగా ముందుకు సాగినట్లయితే వచ్చే ఎన్నికలలో తెదేపా మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమే. కనుక రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చేయాలి. అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగా ఉంచి, రాష్ట్రంలో మిగిలిన అని జిల్లాలకు అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఎయిమ్స్ ఆసుపత్రిని, పశ్చిమ గోదావరి ఏలూరులో హైకోర్టును ఏర్పాటు చేయాలి. అలాగే మిగిలిన ప్రభుత్వ సంస్థలను కూడా అన్ని జిల్లాలలో ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. అలా కాకుండా కేవలం అమరావతినే అభివృద్ధి చేసుకొంటూపోతే వచ్చే ఎన్నికలలో తెదేపా దానికి మూల్యం చెల్లించక తప్పదు,” అని జోగయ్య హెచ్చరించారు.