రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న బాబు మోడీ ప్రత్యేక భేటీ
posted on Aug 7, 2022 8:37AM
ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు చాలా కాలం తరువాత ఒకే వేదికపై కనిపించారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరిగిన అజాదీ కా అమృతోత్సవ్ కమిటీ సమావేశానికి కేంద్రం ఆహ్వానంపై వెళ్లిన చంద్రబాబు ఆ సమావేశం అనంతరం మోడీతో భేటీ అయ్యారు.
ఈ భేటీ ముందుగా షెడ్యూల్ లో లేకపోయినా మోడీ స్వయంగా చంద్రబాబు వద్దకు వచ్చి ఆయనతో ముచ్చటించారు. వారిద్దరూ కొంచం పక్కకు వెళ్లి కొద్ది సేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాలనికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ విషయంలో విభేదించి ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్నారు.
ఆ తరువాత వారిరువురూ కలుసుకోవడం ఇదే ప్రథమం. దీంతో ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలి కాలంలో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని వస్తున్న వార్తలకు ఈ భేటీ బలం చేకూర్చినట్లైంది.మోడీతో భేటీ అనంతరం చంద్రబాబు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.