సినిమాల బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు... తెలంగాణ ఇలా.. ఏపీ అలా!

తెలుగు రాష్ట్రాలలో కొత్త సినిమాలు విడుదలౌతున్నాయంటే ఆ హడావుడే వేరుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా అగ్ర హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే పండగ శోభకు కొత్త సొబగులు అద్దినట్లే ఉంటుంది. ఇక కొత్త సినిమాల విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ల ధరల పుంపు మామూలే. అయితే పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన ఒక్కసారిగా పరిస్థితిని మార్చేసింది.

ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆ సినిమా హీరో అల్లు అర్జున్ వైఖరినీ, అరెస్టై మధ్యంతర బెయిలుపై విడుదలైన అల్లు అర్జున్ ను పరామర్శించడానికి జాతరలా వెళ్లిన సినీ ప్రముఖులనూ తప్పు పట్టారు. తాను సీఎంగా ఉన్నంత వరకూ బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ప్రశక్తే లేదని కుండ బద్దలు కొట్టేశారు. ఈ పరిస్థితి నిస్సందేహంగా తెలుగుసినీ పరిశ్రమకు ఒకింత ఇబ్బందికరంగానే పరిణమించింది. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పుంపు లేకపోతే.. కోట్ల వ్యయంతో నిర్మించిన సినిమాల పెట్టుబడులు వెనక్కు వచ్చే అవకాశాలు మృగ్యమన్న ఆందోళన సినీ పరిశ్రమ వర్గాల్లో వ్యక్తం అయ్యింది. దీంతో తెలంగాణ సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయనతో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ తరువాత కూడా రేవంత్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. శాంతి భద్రతల విషయంలో రాజీ ప్రశక్తే లేదని ఖరాఖండీగా చెప్పేశారు. అదే సమయంలో రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తన ప్రభుత్వం పూర్తిగా అండదండలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. 

సరే తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతించారు. దీంతో ఏపీలో కూడా బెనిఫిట్ షోలకు, టికెట్ల ధర పెంపునకు బ్రేక్ పడినట్లేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. కానీ ఏపీ సర్కార్ తెలుగుసినీ పరిశ్రమకు ఊరట కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  సంక్రాంతికి రాబోతున్న మూడు సినిమాలకు బెనిఫిట్ షోలకు, టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది.   ఈ సంక్రాంతికి విడుదలౌతున్న మూడు సినిమాలు గేమ్ ఛేంజర్, డాకూ మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు వాటి వాటి బడ్జెట్ ను బట్టి  టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన గేమ్‌ ఛేంజర్‌  బడ్జెట్ దాదాపు 300 కోట్ల రూపాయలు కావడంతో ఆ సినిమాకి  మొదటి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌ థియేటర్‌లో రూ.135, మల్టీప్లెక్స్‌ల్లో రూ.175లు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. అలాగే పరిమిత సంఖ్యలో బెనిఫిట్‌ షోలకూ అనుమతించి, బెనిఫిట్ షోలకు టికెట్ల రేట్లను రూ.600లుగా నిర్ణయించింది.

అదే విధంగా బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో   నిర్మించిన డాకు మహారాజ్ సినిమాకు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి దక్కింది. సింగిల్ స్క్రీన్‌ థియేటర్‌లలో రూ.110లు, మల్టీప్లెక్స్‌ల్లో రూ..135లు పెంపునకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. అలాగే బెనిఫిట్‌ షోలకు టికెట్ రేటు 500రూపాయలుగా ఫిక్స్ చేసింది.

అలాగే వెంకటేష్ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకి సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో రూ.75లు, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపునకు ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. మూడు సినిమాలకు ఏపీ ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభించిందని చెప్పాలి.  మొత్తంగా కొత్త సినిమాలకు టికెట్ల రేట్లు పెంపు, బెనిఫిట్ షోల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలూ వేర్వేరు నిర్ణయాలు తీసుకున్నాయి. దీంతో సంక్రాతి సినిమాలకు తెలంగాణలో తక్కువ కలెక్షన్లు, ఏపీలో అధిక కలెక్షన్లు వస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పరిశ్రమకు శరాఘాతంగా మారితే.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పరిశ్రమ వర్గాలకు కొండంత ఊరట చేకూర్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.