అమరావతే రాజధాని.. రాజ్యసభ సాక్షిగా తేల్చేసిన విజయసాయి

అమరావతిని నిర్వీర్యం చేయడం.. అభివృద్ధిని అడ్డుకోవడం తప్ప మూడు రాజధానుల విషయంలో వైసీపీ చేసినదేమీ లేదని తేలిపోయింది. వైసీపీ డొల్లతనం. అబద్దాల ప్రచారం మరోసారి రాజ్యసభ సాక్షిగా బయటపడింది. మాట తప్పడం, మడమ తిప్పడం, చెప్పిన మాట చెప్పలేదనడం ఇవే గత మూడేళ్లుగా ఏపీలో జగన్ సర్కార్ చేస్తున్నదనడానికి ఆ పార్టీ రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లే సాక్ష్యం అని పరిశీలకులు తెల్చి చెప్పేస్తున్నారు.

మూడు రాజధానుల విషయంలో గత మూడేళ్లుగా జగన్ సర్కార్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లు ద్వారా చెప్పకనే చెప్పేశారు. మూడు  రాజధానుల అంశం విషయంలో ఇంత కాలం తాము నేల విడిచి సాము చేశామనీ, తమ చేతుల్లో లేని విషయాన్ని తలకెత్తుకుని రాష్ట్ర ప్రజలకు చెప్పినవన్నీ అబద్ధాలేనని విజయసాయి రెడ్డి ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుతో తేటతెల్లం చేసేసింది.

మూడు రాజధానులు చేస్తామంటూ ఇంత కాలం నుంచి తాము చేస్తున్నదంతా తమ్మిని బమ్మి చేయడానికి చేసిన వృధా యత్నమేని జగన్ సర్కార్ నిస్సిగ్గుగా రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లు ద్వారా అంగీకరించేసింది.  రాజధానుల ఏర్పాటు విషయంలో ఆ రాష్ట్ర శాసనసభకే సర్వ అధికారాలూ ఉండేలా  రాజ్యాంగ సవరణ కోరుతూ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెట్టడంతో ఇంత కాలం ఈ విషయలో జగన్ సర్కార్ ఆడుతున్న డ్రామా బట్టబయలైంది.  స్వయంగా వైసీపీయే  ఏపీలో మూడు రాజధానుల  ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరమని, ఆ సవరణ చేయకుండా ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు అసాధ్యమనీ పార్టీ ఎంపీ ద్వారా పార్లమెంట్‌కు నివేదించింది.

వచ్చే అసెంబ్లీ సమవేశాల్లో మరోసారి మూడు రాజధానుల బిల్లు పెడతామని వైసీపీ నేతలు చెబుతుండటం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికో.. తాము చేతులెత్తేయలేదని నమ్మించడానికో తప్ప జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేసే అవకాశం లేదని  ప్రైవేటు బిల్లు   ద్వారా స్పష్టం అయిపోయింది. ఇప్పుడు రాజ్యసభలో విజయ సాయి ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లు సంగతి  తేలే వరకూ ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టడం దాదాపు అసాధ్యం.

ఇక పార్లమెంట్ చరిత్రలో ప్రైవేటు బిల్లులు చట్టంగా మారిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ప్రచారం కోసమే తప్ప సభ్యులు ప్రైవేటుగా పెట్టే బిల్లులు   చట్టాలుగా మారిన చరిత్రే లేదు. కనుక ఇప్పుడు విజయసాయిరెడ్డి   రాజ్యాంగ సవరణ కోసం పెట్టిన ప్రైవేటు బిల్లు సభ ఆమోదం పొందడం సాధ్యం కాదు. ఎందుకంటే  రాజ్యాంగ సవరణ  మూడింట రెండు వంతుల మెజార్టీ కావాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికే ఈ స్థాయి మద్దతు కూడగట్టడం కష్ట సాధ్యం. ఈ విషయం విజయసాయిరెడ్డికి తెలియనిది కాదు. కానీ ఫేస్ సేవింగ్ విన్యాసంలో భాగంగానే ఆయనీ బిల్లు ప్రవేశపెట్టారని పరిశీలకులు అంటున్నారు. అంటే ఏపీ రాజధాని అమరావతే.. మూడు రాజధానులు మా వల్ల కాదు అని పరోక్షంగా ఈ ప్రైవేటే బిల్లు ద్వారా విజయసాయిరెడ్డి జగన్ సర్కార్ తరఫున రాజ్యసభలో అంగీకరించేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.