పెళ్లయ్యాక మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోకపోతే జరిగే నష్టాలు ఇవే..!

 

పెళ్లి ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక చట్టపరమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది.  ఇదివరకు పెళ్లి అనేది పెద్దల నిర్ణయం తో ముడి పడి.. పలువురిని ఆహ్వానించి అందరి ఆశీర్వాదాల మధ్య జరిగేది.  ఇప్పుడు కూడా ఇలానే జరుగుతున్నా అప్పటికి ఇప్పటికి కొన్ని మార్పులు వచ్చాయి.  పెళ్లికి చట్టపరమైన భద్రత ఏర్పరిచారు. పెళ్లైన ప్రతి జంటకు వివాహ ధృవీకరణ పత్రం మంజూరు చేస్తారు.  అయితే చాలామంది ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.  మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటూ ఉంటారు.  అసలు మ్యారేజ్ సర్ఠిఫికేట్ వల్ల కలిగే లాభాలు ఏంటి? పెద్దల సమక్షంలో అందరి అంగీకారంతో పెళ్ళి జరిగినా, ప్రేమ వివాహాలు చేసుకున్నా ప్రతి జంట మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటారు ఎందుకు? దీని వెనుక గల కారణాలు ఏంటి? తెలుసుకుంటే..

వివాహ ధృవీకరణ పత్రం..

పెళ్లైన ప్రతి జంటకు వివాహ ధృవీకరణ పత్రాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇందుకోసం వివాహ పత్రిక,  పెళ్లి సమయంలో తీయించుకున్న ఒక ఫొటో ప్రభుత్వానికి సమర్పించాలి.  ఇవన్నీ చూశాక ప్రభుత్వం ఆ జంటకు వివాహ ధృవీకరణ పత్రం మంజూరు చేస్తుంది.  ఇది పెళ్లి చేసుకున్న జంటలకు వివాహ బంధం గురించి భరోసా ఇస్తుంది.  ఇందులో ఎవరూ మోసపోయే అవకాశం లేకుండా చేస్తుంది. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ వల్ల మరిన్ని ముఖ్యమైన లాభాలు ఉన్నాయి.

ఇప్పటి భార్యాభర్తలు భవిష్యత్తు మీద చాలా ప్లానింగ్ తో ఉంటున్నారు.  భార్యాభర్తలు ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేసే వారు అయితే వారు విదేశాలకు వెళ్లాలనే ప్లానింగ్ తో ఉంటే వారికి తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి.  మ్యారేజ్ సర్టిఫికెట్ లేని పక్షంలో వారికి వీసా, ఇమిగ్రేషన్ ప్రక్రియలో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి.

వివాహ ధృవీకరణ పత్రం లేకుండా బ్యాంకు డిపాజిట్లు,  జీవిత భీమా, భీమా సౌకర్యాలు,  బ్యాంకు లోన్లు తదితర ప్రభుత్వ,  ప్రైవేటు ప్రయోజనాలు పొందలేరు.  అది చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. ముఖ్యంగా నామినీ పేరు నమోదు కాకపోతే చాలా సమస్యగా మారే అవకాశం ఉంటుంది.

మహిళలకు మ్యారేజ్ సర్టిఫికేట్ చాలా అవసరం.  ఒకవేళ భర్త మరణిస్తే అతనికి సంబంధించిన ఆస్తులపై తన హక్కులను క్లెయిమ్ చేయాలని అనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.  అది లేకపోతే భర్తకు సంబంధించిన ఆస్తులపై హక్కుల కోసం ఆమే చాలా పోరాడాల్సి వస్తుంది.

పెళ్లి చేసుకున్న తరువాత విడాకులు లేదా వివాదాలు ఏర్పడితే.. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా దాన్ని గెలిపించుకోవడం కష్టం.  ఆ వివాహం చెల్లుబాటును సవాలు చేయవచ్చు.  రిజిస్ట్రేషన్ లేకుండా సరైన ఆధారాలు లేని వివాహాలను ప్రభుత్వం చట్టవిరుద్ధమైనవిగా సుప్రీం కోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది కూడా. కాబట్టి ఇప్పట్లో వివాహాల చెల్లుబాటుకు సరైన ఆధారాలు, రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి.

కొన్ని సార్లు వివాహం పేరుతో అమ్మాయిలు, అబ్బాయిలు కూడా మోసపోతుంటారు.  వివాహం అనంతరం మ్యారేజ్ సర్టిఫికెట్ లేకుండా.. సరైన ఆధారాలు లేకుండా చేసి వారిని మోసం చేస్తుంటారు. ముఖ్యంగా మహిళలు ఇలాంటి మోసాలలో ఎక్కువగా నష్టపోతుంటారు. కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే ఇలాంటి మోసాలకు అడ్డు కట్ట వేయవచ్చు.


                                                *రూపశ్రీ.