మీకు మంచి లైఫ్ పార్ట్నర్ కావాలా.. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..!
posted on Nov 29, 2024 10:08AM
ప్రతి మనిషి తన జీవితంలో వివాహం అనే దశను చేరుకుంటాడు. సంసార సాగరంలో ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకుని ఈదుతూ ఉంటాడు. చాలామంది సింగిల్ గా ఉన్నప్పుడు జీవితం చాలా బాగుండేది.. వివాహం అయ్యాక స్వేచ్ఛ పోయింది అనే మాట అంటుంటారు. ఇంకొందరు ఏమో తన ఆలోచనలు, అభిరుచులకు సరైన భాగస్వామి రాలేదు అని అంటుంటారు. ఇప్పటికే పెళ్లైన వారిలో చాలామంది పెళ్లే వద్దు బాబోయ్ అని వివాహ బంధం గురించి తమ అనుభవాలను చెప్పి ఇతరులను భయపెడుతూ ఉంటారు. అయితే మంచి లైఫ్ పార్ట్నర్ ఉంటే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. మంచి పార్ట్నర్ ను ఎంచుకునే విషయంలో ఆచార్య చాణక్యుడు కొన్ని విషయాలు వెల్లడించాడు. అవేంటో తెలుసుకుంటే..
పెళ్ళి చేసుకునే ఆలోచన ఉన్నవారు.. లైఫ్ పార్ట్నర్ ను ఎంచుకునే విషయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
నిజాయితీ..
నిజాయితీగా ఉండే వ్యక్తులు మాత్రమే జీవితంలో మంచి లైఫ్ పార్ఠ్నర్ లు కాగలరు. అబద్దాల కోరును ఎవరూ నమ్మరు. ఒకవేళ పెళ్లి తరువాత ఇలాంటి వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నా అబద్దాలు చెప్పడం వల్ల ఆ సంసారం ఎప్పటికీ సంతోషంగా ఉండదు.
దయ..
ఇతరుల పట్ల దయా గుణం కలిగిన వారు మంచి లైఫ్ పార్ట్నర్ లు గా ఉండగలరు. బయటి వ్యక్తుల పట్ల దయ చూపించే వారు భాగస్వామి విషయంలో మరింత ప్రేమ, దయ, సానుభూతి, పరిస్థితులను అర్థం చేసుకోవడం చేయగలరు. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలలో బ్యాలెన్స్డ్ గా ఉండగలరు.
మర్యాద..
ఇతరులకు మర్యాద గౌరవం ఇవ్వడం తెలిసిన వ్యక్తి ఎప్పటికీ ఎవరినీ అకారణంగా నొప్పించరు. తన లైఫ్ పార్ట్నర్ ను కూడా చాలా విలువైన వ్యక్తిగా భావిస్తారు. మర్యాద ఇవ్వడం, గొప్ప స్థానాన్ని ఇవ్వడం చేస్తారు. అయితే ఈ గుణాలన్నీ ఉన్నట్టు నటించే వ్యక్తులు కొందరు ఉంటారు. కాబట్టి వ్యక్తులను సులువుగా ఎంచుకోకుండా కాస్త సమయం తీసుకోవడం మంచిది. వ్యక్తి గురించి విచారించడం కూడా మంచిది. ఒక వ్యక్తి జీవితంలో జీవితాంతం కలిసి ఉండేది భాగస్వామి మాత్రమే కాబట్టి.. భాగస్వామి విషయంలో ఎప్పుడూ తొందరపాటు అడుగులు వేయకూడదు.
*రూపశ్రీ.