వైసీపీ, బీజేపీ బంధం కొనసాగుతోందా?.. కూటమి ధర్మం నుంచి బీజేపీకి మినహాయింపు ఉందా?

ఆంధ్రప్రదేశ్ లో వైసీసీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ, అంతకు ముందు విపక్షంలో ఉండగా మూడున్నరేళ్లూ బీజేపీ ఆ పార్టీకి అన్ని విధాలుగా అండదండగా నిలిచింది. వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసుల విచారణ వేగం పుజుకోకపోవడం నుంచి, అధకారంలో ఉండగా జగన్ ఆర్థిక అరాచకత్వానికి ప్రోత్సాహం ఇవ్వడం నుంచీ బీజేపీ వైసీపీకి, జగన్ కు వెన్నుదన్నుగా నిలిచింది. ఇవి ఆరోపణలకు మాత్రమే కాదు.. అక్షర సత్యాలంటూ పరిశీలకులు బోలెడు ఉదాహరణలు చూపుతున్నారు. జగన్ హయాంలో ప్రభుత్వం అడ్డగోలు అప్పులు చేసిందంటే అందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ అత్యంత ఉదారంగా వ్యవహరించడమే కారణమనడంలో సందేహం లేదు. అంతకు ముందు వైసీపీ విపక్షంలో ఉన్న సమయంలో కూడా అప్పటికి అధికారంలో ఉన్న మిత్రపక్షమైన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన మోడీ సర్కార్ విపక్షంగా వైసీపీ ఏపీలో బలపడటానికి తన వంతు సహకారం అందించారు. 

అయిదేళ్ల జగన్ పాలన కారణంగా బీజేపీకి ఇంకా ఆ పార్టీకి వంత పాడితే మొదటికే మోసం వస్తుందన్న భయంతో వైసీపీకి తెగదెంపులు తెచ్చి తెలుగుదేశం, జనసేనలతో పొత్తు పెట్టుకుంది. ఆ పొత్తు వల్ల ఏపీలో రాజకీయంగా బీజేపీ లబ్ధి పొందింది. అంతే కాకుండా కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి తెలుగుదేశం రూపంలో బలమైన అండ కూడా లభించింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వ మనుగడ ఇప్పుడు తెలుగుదేశం మద్దతుపైనే ఆధారపడి ఉంది. అయినా కూడా బీజేపీకి వైసీపీతో అనుబంధం వదులుకోవడానికి మనసు రావడం లేదా? అంటే జరుగుతున్న పరిణామాలను, ఆ పార్టీ ఎంపీతో అమిత్ షా భేటీని, ఆ భేటీ జరిగిన సమయాన్ని బట్టి చూస్తే ఔననే సమాధానమే వస్తుంది.  

తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయనతో భేటీ అయిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విజయసాయి అమిత్ షా భేటీ అయిన సమయాన్ని బట్టి చూస్తుంటే... వైసీపీ అధినేతను ఆదుకోవడానికి, ఆయనను ఆపదలలోంచి బయటపడేయడానికి బీజేపీ ఇంకా తహతహలాడుతోందని భావించవలసి వస్తోంది. ఎందుకంటే ఇటీవలే అమెరికాలో అదానీపై కేసు నమోదైంది. ఆ కేసులో జగన్ పేరు, ప్రస్తావన ఉంది.  సరిగ్గా ఈ తరుణంలో విజయసాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం అనుమానాలకు తావిస్తోంది.  జగన్ ను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు ఆయన దూతగా విజయసాయి అమిత్ షాను కలిశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   పైగా ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హస్తిన పర్యటన జరిగిన వెంటనే ఉండటంతో తెరవెనుక ఏదైనా జరుగుతోందా అన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. అదానీ, జనగ్ అమెరికా కేసు విషయంలో పవన్ కల్యాణ్ మాట్లాడకపోవడంతో బీజేపీ ఈ విషయంలో జగన్ కు సహకారం అందిస్తున్నదా? అందుకే పవన్ కల్యాణ్ ను అమెరికా కేసు గురించి మాట్లాడవద్దని సూచించిందా అన్న చర్చ రాజకీయ వర్గాలలో మొదలైంది.