భారత నేవీ డే 2024 - విదేశీ శక్తుల మీద ఉక్కుపాదం.. భారత నౌకాదళం.. !


 


ఏ దేశానికయినా అన్నివైపుల నుంచి రక్షణ కల్పించటానికి భద్రతా దళాల పాత్ర చాలా ఉంటుంది. అయితే మారుతున్న ప్రపంచ దేశాల స్థితిగతులు, విధివిధానాల వల్ల  మన దేశ భద్రత పరంగా, ఆర్ధికపరంగా  భారత నేవీ పాత్ర ముఖ్యమైనదిగా  మారింది. దేశ ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవటంలో సముద్రమార్గాల ద్వారా  జరిగే వాణిజ్య రవాణా  కీలకమవుతుంది. ఒక పక్క రవాణా  సజావుగా సాగేలా చేస్తూ,  ఇంకో పక్క విదేశీ శక్తులనుంచి మన దేశాన్ని కాపాడుతున్న మన  నేవీ ఎంతో గొప్పది.   

 
1971లో భారతదేశానికి, పాకిస్థానుకి  మధ్య  జరిగిన యుద్ధంలో  డిసెంబర్ నాలుగో తేదీన   ట్రైడెంట్ ఆపరేషన్లో  వీరోచితంగా పొరాడి, భారత నేవీ గొప్ప విజయాన్ని  సాదించింది. ఆ యుద్ధంలో  భారత నేవీ  పాకిస్థాన్ ప్రధాన పోర్ట్ నగరమైన  కరాచీపై ధైర్యంగా దాడి చేసింది. ఇది ఒక ప్రధాన సైనిక విజయమే కాకుండా, భారత నేవీకి ఉన్న  శక్తిని ప్రపంచానికి తెలియజేసింది.

అందుకే దేశ రక్షణలో వారి పాత్రను, త్యాగాలను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న భారత నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తారు. మన దేశ  భద్రత కోసం ప్రాణత్యాగాలు చేసి, దేశ రక్షణ కోసం  సముద్ర సరిహద్దులను అహర్నిశలు కాపుకాసి మన నౌకాదళం చేస్తున్న కృషిని, వారు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవటానికి జరుపుకునే  నేవీ డే చాలా ప్రత్యేకమైనది. 

నౌకాదళ ప్రాముఖ్యత -పాత్ర:

భారత దేశం  విస్తృతమైన తీరప్రాంతం కలిగి ఉంది. ఇంత పొడవైన  తీరప్రాంతాన్ని రక్షించటంలోనూ,   మన దేశానికి చెందిన సముద్ర ప్రాంతంలో  శాంతిని  కాపాడడంలోనూ,  సముద్ర మార్గాలను పర్యవేక్షించి,   వాణిజ్య  మార్గాలకి  భద్రత కల్పించటంలోనూ,  ప్రకృతి పరంగా సంభవించే విపత్తుల సమయంలో సహాయం అందించడంలోనూ, అంతర్జాతీయ సముద్ర సహకారాన్ని ప్రోత్సహించడంలోనూ  భారత నౌకాదళం కీలక పాత్ర పోషిస్తుంది. 

ప్రతి సంవత్సరం, భారత నౌకాదళం తన వ్యూహాత్మక లక్ష్యాలను ప్రతిబింబించేలా ఓ థీమ్‌ను ఎంచుకుంటుంది. వీటిలో.. రక్షణ, సాంకేతిక అభివృద్ధి, సముద్ర భద్రత వంటి అంశాలపై అవి కేంద్రీకృతమవుతాయి. 2024 సంవత్సరానికి "ఆవిష్కరణ, స్వదేశీకరణ ద్వారా  నౌకాదళ శక్తిని, బలాన్ని పెంచుకోవటం." అనే థీమ్‌ను ఎంచుకోబడింది. 

ఇప్పటి నౌకాదళం అత్యాధునిక సాంకేతికతను కలిగిన మిస్సైల్స్, ఫైటర్ జెట్లు, యుద్ధనౌకలను కలిగి ఉంది. భారత నావికాదళంలో INS విక్రాంత్, INS అరిహంత్ వంటి సమర్థవంతమైన  యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇవి మన దేశ భద్రతలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి

నేవీ డే వేడుకలు: 

నేవీ డే సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరుగుతాయి.  వేడుకల్లో భాగంగా సీనియర్ అధికారులు నౌకాదళానికి నివాళులు అర్పిస్తారు.  గౌరవనీయులంతా  జెండా ఎగరవేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సముద్రతీర రక్షణలో  కీలకమైన నౌకాదళ అధికారులను గౌరవించడమే కాకుండా, దేశ భద్రత కోసం సముద్రంలో  ఎన్నో కష్టాలకోర్చి పని చేసిన, పనిచేస్తున్న వీర  సైనికులని గుర్తించి, గౌరవిస్తారు. మాజీ నావికుల సేవలను గౌరవించే ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. భారత నౌకాదళ  సైనికుల త్యాగాలను, నిబద్ధతను గుర్తించే ప్రత్యేక కార్యక్రమాలతో  నేవీ డే ఘనంగా నిర్వహించబడుతుంది.

ఈ రోజు నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు ప్రజలకు ప్రదర్శనకు అందుబాటులో ఉంటాయి. నేటి విద్యార్థులు, యువతకి భారత నౌకాదళ గొప్పతనం గురించి, దేశ రక్షణలో దాని ప్రాముఖ్యత గురించి  అవగాహన కల్పించటం ద్వారా  నేవీ పట్ల ఆసక్తి కలిగేలా చేయటానికి ఇదొక అవకాశం.  భారత నౌకాదళానికి లాల్ సలామ్..!!

                                        *రూపశ్రీ.