మీరు చదువుకుంటూ పనిచేస్తుంటారా? ఇలా నష్టపోతారు..!

 


బాధ్యత మనిషికి చాలా నేర్పుతుంది. నేటికాలంలో యువత అయినా పేద కుటుంబాలలో పుట్టిన వారు అయినా,  మధ్య తరగతి పిల్లలు అయినా,  తాము ఏర్పరుచుకున్న పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకోవడంలో కేవలం కష్టపడి చదివితే సరిపోదు.. దానికి తగ్గట్టు ఆర్థికంగా సహకారం కూడా అవసరం అవుతుంది.  కొందరు బాధ్యతగా పెరిగిన పిల్లలు,  యువత, తమ చదువుల భారం కుటుంబం మీద వేయకుండా పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తుంటారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేవారు..ఎక్కువ ఫీజులు కట్టి చదువుకునేవారు.. ఆర్ఠిక అవసరం కోసం పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తుంటారు. పట్టణాలలో ఇలాంటి యువత చాలా కనిపిస్తుంది. కానీ ఇలాంటి యువతలో చాలా మంది తమ లక్ష్యాలు చేరుకోవడంలో ఫెయిల్ అవుతుంటారు.  కష్టం తప్ప ఫలితాన్ని  అందుకునే వారు చాలా తక్కువ.  కానీ ఇలా చదువుకుంటూ.. పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తే చాలా నష్టపోతారని కెరీర్ గైడెన్స్ నిపుణులు అంటున్నారు. దీని వెనుక గల కారణాలు ఏంటో తెలుసుకుంటే..

చెప్పుకోవడానికి పార్ట్ టైమ్ జాబ్ ఏ అయినా అందులోనూ ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది.  ఈ కారణంగా విద్యార్ధులు చదువు పై దృష్టి పెట్టడం కష్టం అవుతుంది.  వంద శాతం ఏకాగ్రత పెట్టి చదవడం సాధ్యం కాదు.  ఉద్యోగంలో ఏర్పడిన లక్ష్యాలు,  టార్గెట్లు,  ఉద్యోగంలో బెస్ట్ అనిపించుకోవాలనే ఆరాటం అందరిలో ఉంటుంది.  దీని కారణంగా  చదువులో బెస్ట్ గా ఉండలేరు.

ఒక వైపు చదువుకోవడం,  మరొక వైపు ఉద్యోగం చేయడం రెండూ మెదడుకు పని చెప్పేవే.. ఎక్కువ సమయం మెదడు పని చేయడం వల్ల మానసికంగా అలసిపోతారు.  మరొకవైపు శారీరక సమస్యలు కూడా వస్తాయి. దీని వల్ల రెండింటిలోనూ ఉత్తమ ఫలితాలు ఇవ్వడం తగ్గిపోతుంది.

చదువుకుంటూ ఉద్యోగం చేయడం వల్ల రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం అవుతుంది.  రెండింటిలో దేనికీ పూర్తీ న్యాయం చేయలేరు.  అంతే కాదు.. ఈ రెండింటిని చేయడం వల్ల కుటుంబం,  స్నేహితులు మొదలైన వారితో గడిపే సమయం చాలా తగ్గిపోతుంది. దీని వల్ల కుటుంబ బంధాలు దెబ్బ తింటాయి. వీటి కారణంగా ఒత్తిడి,  ఆందోళన పెరుగుతాయి.

ఉద్యోగం చేసే విద్యార్థులు చదువుకు ఎక్కువ సమయం కేటాయించలేరు.  ముఖ్యంగా కాలేజ్ లో చెప్పిన విషయాలను తిరిగి సమీక్షించుకునే అవకాశం,  పోటీ పరీక్షలు మొదలైన వాటికి సన్నద్ధం అయ్యే అవకాశం అస్సలు ఉండదు. అందుకే చదువులో ఉత్తమ ఫలితాలు సాధించడం కష్టమవుతుంది.

చదువుకుంటూ ఉద్యోగం చేసేవారు.. చదువులో బాగంగా చేసే కొన్ని పనులలో వెనుక బడతారు.  ఇంటర్న్షిప్ లు, ప్రాజెక్ట్ లు,  ఇతర ముఖ్యమైన అవకాశాలను వదులుకోవాల్సి ఉంటుంది. వీటి వల్ల చదువులో సాధారణ విద్యార్థి లాగే ఉండిపోతారు తప్ప ఉత్తమ ఫలితాలు  సాధించే విద్యార్థి గా ఎప్పటికీ కాలేరు.


                                           *రూపశ్రీ.