అమరావతే చంద్రబాబు ఆవాసం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకోవాలని భావిస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా ఉండవల్లి గ్రామంలోని లింగమనేని గెస్ట్‌హౌస్‌లో నివాసం ఉంటున్న ఆయన పలు సందర్భాలలో  అమరావతిలో తన సొంత ఇంటిని నిర్మించుకుంటానని వెళ్లడించారు. అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది.  అమరావతి రాజధాని ప్రాంతంలోని వెలగపూడి ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇంటికి కావాల్సిన అన్ని అవసరాలను తీర్చే విధంగా శాశ్వత నివాసాన్ని నిర్మించాలని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు.

ఇందు కోసం ఇటీవల వెలగపూడి లో పాతికవేల  చదరపు గజాల స్థలాన్ని చంద్రబాబు కుటుంబం కొనుగోలు చేసింది. రాష్ట్ర ల్యాండ్ పూలింగ్ పథకం కింద ముగ్గురు రైతుల నుండి కొనుగోలు చేసిన ఈ భూమి   గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు, ఎన్జీవో నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలకు సమీపంలోనే ఉంది.  ఈ ప్లాట్‌కు నాలుగు వైపులా రహదారి సౌకర్యం ఉంది.  అలాగే  సీడ్ యాక్సెస్ మార్గానికి అనుసంధానమై ఉంది. దాదాపు 5.5 ఎకరాల్లో నిర్మించనున్న ఈ నివాసంలో పార్కింగ్ సౌకర్యాలు, సిబ్బందికి వసతి కల్పించనున్నారు. సన్నాహక భూ పరీక్షలు  జరుగుతున్నాయి మరియు త్వరలో నిర్మాణం ప్రారంభం కానుంది.