'మహాభారత్' నటుడి మరణం.. కారణమిదే!

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. గురువారం (సెప్టెంబర్ 14).. 'మహాభారత్'లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు కన్నుమూశారు. 

వివరాల్లోకి వెళితే.. దిల్ చాహ్తా హై, చక్ దే ఇండియా, మర్దాని చిత్రాలతో సినీ పరిశ్రమలోనూ.. సప్నే సుహానే లడక్ పాన్ కే, మహాభారత్ సీరియల్స్ తో టీవీ పరిశ్రమలోనూ గుర్తింపు పొందిన నటుడు రియో కపాడియా (66). మూడు దశాబ్ధాల అభినయ పర్వంలో పలు ధారావాహికల్లో అలరించారాయన. కాగా, గత ఏడాది నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్న రియో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్ను మూశారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు తెలియజేశారు.  అలాగే, శుక్రవారం (సెప్టెంబర్ 15) ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

కాగా, మహాభారత్ లో రియో కపాడియా గాంధారి తండ్రి పాత్ర పోషించారు. గాంధార రాజు సుబల వేషంలో తనదైన అభినయంతో మెప్పించారు. ఇక చివరిసారిగా ఆయన మేడ్ ఇన్ హెవెన్ 2 అనే వెబ్ సిరీస్ లో కనిపించారు. అందులో మృణాళ్ తండ్రిగా ఆకట్టుకున్నారు. ఇక రియో కపాడియా వ్యక్తిగత విషయానికి వస్తే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.