నటుడు నాగార్జునపై క్రిమినల్ కేసు వెనుక రాజకీయ ‘హస్తం’

హీరో నాగార్జునకు ఇటీవల ఒకదాని తరువాత ఒకటిగా ఇబ్బందులు, వివాదాలు ఎదురౌతున్నాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, కుమారుడు నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ వ్యాఖ్యలు ఇలా నాగార్జునకు ఊపిరి సలపని వివాదాలు, కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఈ తరుణంలో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదై  ఆయనకు కొత్త తల నొప్పి తీసుకువచ్చింది. దీని వెనుక ఏదైనా రాజకీయ కక్ష సాధింపు ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  జనం కోసం అనే సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి మాదాపూర్ పోలీసు స్టేషన్ లో నాగార్జునపై ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువు కబ్జా చేసి అక్రమంగా ఎన్ కన్వెన్షన్ నిర్మించారనీ, ఆ విషయాన్ని రెవెన్యూ అధికారులు సైతం నిర్ధారించారనీ పేర్కొంటూ ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మాణం వల్ల ప్రజలకు అసౌకర్యం, పర్యావరణానికి భంగం కలిగించారనీ, ఎన్ కన్వెన్షన్ ద్వారా కోట్లాది రూపాయల వ్యాపారం చేశారని కసిరెడ్డి భాస్కరరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటన్నిటితో పాటు ఇరిగేషన్ చట్టాలను నాగార్జున ఉల్లంఘిచారని ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కసిరెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  చెరువును పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చును కూడా నాగార్జున నుంచే వసూలు చేయాలన్నారు. కసిరెడ్డి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు  అయితే లీగల్‌ ఒపీనియన్‌ తీసుకున్న తర్వాత ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదే కసిరెడ్డి   తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టిఎల్‌లో నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించారంటూ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో కదిలిన హైడ్రా ఆ ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది. తాజాగా కసిరెడ్డి భాస్కరరెడ్డి మాదాపూర్ పోలీసు స్టేషన్ లో  చేసిన ఫిర్యాదులో పర్యావరణానికి ఆటంకం కలిగించారని, ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశారని, అందుకే ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కోరారు.  ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేసిన నెల రోజుల తర్వాత మళ్లీ కసిరెడ్డి భాస్కరరెడ్డి తెరపైకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల అక్కినేని నాగార్జున కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై సీరియస్‌ అయిన నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఈలోగా భాస్కరరెడ్డి మాధాపూర్‌లో నాగార్జునపై ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Publish Date: Oct 5, 2024 12:16PM

600 మందిని కాల్చేశారు!

పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలోని బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు దాదాపు 600 మందిని పిట్టల్ని కాల్చేసినట్లు కాల్చి చంపారు. ఆగస్టులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరిస్తోంది. ఆగస్టు 24న బర్సాలోగో పట్టణంపై బైకులపై దూసుకొచ్చిన ఉగ్రవాదులు కన్పించిన వారినల్లా కాల్చేశారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే. అల్ బైదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లామ్ వాల్ ముస్లిమిన్ (జేఎన్ఐఎం) మిలిటెంట్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. బుర్కినాఫాసోలో తరచుగా మిలిటెంట్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు గ్రామాల చుట్టూ లోతైన కందకాలు తవ్వుకోవాలని అక్కడి మిలటరీ ఆదేశించింది. దీంతో ఆగస్టు 24న బర్సాలోగో ప్రజలు తవ్వకాలు జరుపుతుండగా ఉగ్రవాదులు వారిని సైనికులుగా భావించి దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో ప్రజలు పరుగులు పెట్టినా వెంటాడి మరి కాల్పులు జరిపారని తెలుస్తోంది.  ఈ ఘటనలో 200 మంది మరణించినట్లు ఐక్యరాజ్య సమితి మొదట అంచనా వేసింది. కానీ, దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. ఘటన తర్వాత మృత దేహాలను సేకరించేందుకు అధికారులకు మూడు రోజుల సమయం పట్టిందని ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. ఉగ్రదాడి తర్వాత బుర్కినా ఫాసో వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కానీ, వాటిని సైన్యం అణచివేసింది.
Publish Date: Oct 5, 2024 12:09PM

అప్పుడు మోడీకి గుడి.. ఇప్పుడు బీజేపీకి గుడ్ బై

మోడీ ప్రతిష్ఠ మసకబారుతోందనడానికి తాజా ఉదాహరణ ఇది. మయూర్ ముండే.. ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం ఉండకపోవచ్చు. కానీ ప్రధాని మోడీకి గుడికట్టిన బీజేపీ కార్యకర్తగా ఆయనను అందరూ గుర్తుపడతారు. పూణెకు చెందిన మయూర్ ముండే  మోడీకి వీర భక్తుడు. ఎంతటి భక్తుడంటే మయూర్ ముండే దృష్టిలో మోడీ ఒక దేవుడు. ఎందరు వద్దన్నా, పెద్ద పెద్దవారు అభ్యంతరం పెట్టినా, చివరాఖరికి బీజేపీ జాతీయ నాయకత్వం వారించినా కూడా లెక్క చేయకుండా 2021లో ఆయన మోడీకి ఏకంగా ఒక గుడి కట్టేశారు. ఎందుకంటే మోడీని పూజించడానికి ఒక చోటు కావాలి. అది ఈ గుడే కావాలి అంటూ గట్టిగా వాదించారు.  అటువంటి మయూర్ ముండే ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసేశారు. తన రాజీనామా లేఖలో బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు  చేశారు. పార్టీ మౌలిక సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చేసిందని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు బీజేపీకి అధికారమే పరమావధిగా మారిపోయిందని పేర్కొన్నారు. ఇందు కోసం పార్టీ బయట నుంచి రాజకీయ నాయకులను దిగుమతి చేసుకుంటోందనీ, దీర్ఘ కాలంగా పార్టీలో ఉంటూ విధేయులుగా ఉన్న వారిని పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు. తన దేవుడు మోడీ కూడా అధికారం వచ్చాకా మారిపోయారనీ, ఆ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం సమంజసం కాదని భావిస్తున్నాననీ మయూర్ ముండే తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.  
Publish Date: Oct 5, 2024 11:56AM

టీటీడీలో రివర్స్ టెండరింగ్ రద్దు!

తిరుమలలో భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా వకుళ మాత అన్నప్రసాద వంటశాలను ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తిరుమల పర్యటనలో భాగంగా రెండో రోజు శనివారం ఆయన వకుళ మాత వంటశాలను ప్రారంభించారు. అంతకు ముందు ఆయన పద్మావతి అతిథిగృహంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.  అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతానికి పెంచాలని  ఇందుకోసం  ప్రణాళికతో పనిచేయాలన్నారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలన్నారు.  ఇదిలా వుండగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ టిటిడి ఎగ్జిక్యూటివ్  ఆఫీసర్ శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు టీటీడీ కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది.
Publish Date: Oct 5, 2024 11:52AM

రేవంత్ మౌనం దేనికి సంకేతం?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుకు పెట్టింది పేరు. ఏ విషయంలోనైనా సరే ఆయన మాటలు తూటాల్లా పేలతాయి. మరీ ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొట్టడంలో ఆయన దిట్ట. ఏదైనా వివాదం ఉత్పన్నమైతే మొట్టమొదట స్పందించేది రేవంత్ రెడ్డే. రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టినది కూడా రేవంత్ లోని ఆయన దూకుడే. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాతే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంది. అంతకు ముందు పదేళ్ల పాటు, అంటే రాష్ట్ర ఆవిర్భావం నుంచీ కూడా కాంగ్రెస్ రాష్ట్రంలో ఉనికి మాత్రంగానే మిగిలింది. అధికారం చేజిక్కించుకుంటున్నద ఆశ ఆ పార్టీ రాష్ట్ర నేతల్లోనూ, హై కమాండ్ లోనూ లేశ మాత్రమైనా కనిపించేది కాదు. అటువంటిది రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ గ్రాఫ్ ను అమాంతంగా పెంచేశారు రేవంత్. ఇందుకు ఆయన వాగ్దాటి, విషయంపై ఉన్న స్పష్టమైన అవగాహన, ప్రత్యర్థుల విమర్శలను దీటుగా తిప్పిగొట్టగలిగే సామర్ధ్యమే కారణం. అయితే   మంత్రి కొండా సురేఖ‌ వివాదంపై మాత్రం రేవంత్ రెడ్డి మౌనం పరిశీలకులను సైతం విస్మ య పరుస్తోంది. కొండా సురేఖ సమంత, కొందరు హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలియనిదికి కాదు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను  విమర్శిస్తున్నానంటూ ఆమె సినిమా హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వివాదం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. అన్ని వైపుల నుంచీ, అన్ని వర్గాల నుంచీ, చివరాఖరికి కాంగ్రెస్ నుంచి కూడా ఆమె వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం క్షమాపణలతో సరిపెట్టేసే తప్పు కాదు కొండా సురేఖది అంటున్నారు.  పెద్దగా మీడియా ముందుకు రాని మహేష్ బాబు వంటి వారు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత బంధువులపై విమర్శల దాడి జరిగినప్పుడు కూడా కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లుగా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఘాటైన పదజాలంతో ఖబడ్డార్ అన్నట్లుగా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు.   ఇలా అన్ని వైపుల నుంచీ కొండా సురేఖ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె వ్యాఖ్యల కారణంగా ప్రభుత్వం పరువు కూడా మసకబారిందని కాంగ్రెస్ వర్గాలే కారాలూ మిరియాలూ నూరుతున్నాయి. మంత్రి హోదాలో సురేఖ చచేసిన వ్యాఖ్యల ప్రభావం నిస్సందేహంగా రేవంత్ సర్కార్ పై కూడా పడుతుంది. పడుతుంది ఏమిటి పడింది కూడా.  ఇక్కడే పరిశీలకులు ఇదేదో తుపాను ముందు ప్రశాంతతలా ఉందంటూ కాంగ్రెస్ వర్గాలలో అయితే మంత్రి సురేఖను కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలున్నాయంటున్నారు. లేదా ఆమెనే  మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరే అవకాశాలున్నాయంటున్నారు.  రేవంత్ మౌనం సంకేతమిదేనని అంటున్నారు. 
Publish Date: Oct 5, 2024 9:46AM

కుటుంబం ఇలా ఉంటే ఆ ఇంటి పిల్లలు అభివృద్ది పథంలో దూసుకెళ్తారట..!

  జీవితంలో ప్రతి వ్యక్తికి కుటుంబం చాలా కీలకం. మనిషికి కుటుంబం ఆర్థికంగానే కాదు.. వ్యక్తిత్వ పరంగా,  విలువల పరంగా చాలా నేర్పుతుంది. కుటుంబం గురించి, కుటుంబం ఎలా ఉంటే పిల్లలు అభివృద్ది పథంలో దూసుకెళ్తారు అనే విషయం గురించి ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు.  సంతోషకరమైన కుటుంబం ఎలా ఉంటుందో కూడా చెప్పాడు.  దీని గురించి తెలుసుకుంటే.. 'మూర్ఖా యత్ర న పూజ్యంతే ధాన్యం యత్ర సుసఞ్చితం'              దమ్పత్యేః కల్హో నాస్తి తత్ర శ్రీః స్వయమాగతః । ఒక ఇంట్లో మూర్ఖులను గౌరవించడం కంటే ఆ ఇంట్లో మంచి వారిని,  మంచి గుణం కలిగిన వారిని గౌరవిస్తూ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందట. ఇలాంటి కుటుంబంలో ఉన్న వారు జీవితంలో అబివృద్ది చెందుతారట. ఇది మాత్రమే కాదు.. ఇంకా ఏమన్నారంటే.. యస్య పుత్రో వశిభూతో భార్యా ఛన్దానుగామినీ । విభవే యశ్చ సతాంసతస్య స్వర్గం . చాణక్య నీతిలో పొందుపరిచిన ఈ శ్లోకం ప్రకారం..  ఎవరి కొడుకు అయితే నియంత్రణలో ఉంటాడో.. ఏ ఇంట్లో అయితే మహిళలు కూడా తమ కోరిక,అభివృద్ది మేరకు విద్య, ఉద్యోగం విషయాలలో ఉండగలుగుతుందో,  ఏ ఇంట్లో అయితే తాము సంపాదించుకున్న డబ్బుతో తృప్చిగా ఉంటారో.. అలాంటి కుటుంబంలో వ్యక్తులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారట. అలాంటి ఇళ్లలోనే ఆనందం కూడా ఉంటుందట. తే పుత్రా యే పితుర్భక్తాః సా పితా యస్తు నూత్రికాః । తన్మిత్రం యస్య విశ్వాసః స భార్యా యత్ర నిర్వృత్తిః । చాణక్య నీతి ప్రకారం ఏ ఇంట్లో అయితే పిల్లలు తల్లిదండ్రుల నియంత్రణలో ఉంటారో.. ఏ ఇంట్లో అయితే పిల్లలు తల్లిదండ్రుల మాట పాటిస్తారో ఆ ఇంటి పెద్ద ఎప్పడూ సంతోషంగా ఉంటాడట. తండ్రి మాటను పాటించే కుటుంబం ఎప్పుడూ ఆనందంతో,  సంతోషంతో ఉంటుందట. నీతిజ్ఞః శీలమ్పన్నా భవన్తి, కులపూజితః. బాల్యంలో చదివిన విద్యను బట్టి పిల్లలు అభివృద్ధి చెందుతారని చాణక్య నీతిలోని ఈ శ్లోకం అర్థం.  అందుకే పిల్లలకు చిన్నతనంలోనే మంచిదారిలో తీసుకువెళ్లాలి.  వారికి మంచి చెడుల గురించి తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనంలోనే చెప్పాలి.  అలాంటి పిల్లలు పెద్దయ్యే కొద్ది ఉత్తమ పౌరులుగా అబివృద్ది పథంలో దూసుకుపోతారు.                         *రూపశ్రీ.  
Publish Date: Oct 5, 2024 9:30AM