జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి వచ్చిన నేషనల్ అవార్డు రద్దయింది. తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన యువతి మీద అత్యాచారం జరిపాడన్న ఆరోపణ మీద జానీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యంలో, ఆయనకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా వచ్చిన నేషనల్ అవార్డును అవార్డుల కమిటీ రద్దు చేసిసింది. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను జానీ ఎంపిక అయ్యారు. తిరుచిట్రంబళం అనే తమిళ సినిమాలోని ‘మేఘం కరుకాథ’ అంటూ సాగే పాటకు కొరియోగ్రఫీ చేసినందుకు ఆయన్ని ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఎంపిక చేశారు. అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ వరకు జాతీయ అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలో జరగనుంది. ఈ అవార్డు ఫంక్షన్ కోసం జానీ మధ్యంతర బెయిల్ పొందారు. ఈ నెల 8న ఆయన అవార్డు అందుకోవలసి వుంది. నేషనల్ అవార్డు అందుకోవడం కోసమే జానీ మాస్టర్‌కి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ అవార్డు రద్దు చేయడంతో బెయిల్ రద్దుపై సందిగ్ధం ఏర్పడింది. అవార్డు అందుకోవడం కోసం జానీ మాస్టర్‌కి బెయిల్ ఇచ్చినందుకు ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యాచారం లాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అవార్డు ఇవ్వడం సమంజసం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తూ వచ్చాయి. జానీ మాస్టర్‌కి జాతీయ అవార్డుల కార్యక్రమంలో కనిపించడానికి సిగ్గు వుండాలి లాంటి ఘాటు విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌కి ప్రకటించిన నేషనల్ అవార్డు రద్దయింది.
Publish Date: Oct 5, 2024 10:42PM

కొండా సురేఖపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. కేబినెట్ నుంచి ఉద్వాసనేనా?

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా ఉంది. ఆమెపై చర్యలకు సిద్ధమౌతోంది. నటి సమంతపై ఆమె చేసిన వ్యాఖ్యల వేడి హస్తినను తాకింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమంతపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా సురేఖను ఆదేశించారు. రాజకీయ విమర్శలలో మహిళలను ఎలా లాగుతారని రాహుల్ గాంధీ కొండా సురేఖను నిలదీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సమంతపై చేసిన  వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీ కొండా సురేఖను ఆదేశించారు. ఆమె కూడా క్షణం ఆలస్యం చేయకుండా తన వివరణను రాహుల్ కు పంపారు. ఆమె సుదీర్ఘ వివరణపై ఇంకా రాహుల్ నుంచి ఎటువంటి స్పందనా వెలువడ లేదు.  అయితే సమంత, నాగ చైతన్య విడాకుల విషయంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల అనంతరం అన్ని వైపులనుంచీ ఆమెపై విమర్శల దాడి జరిగింది. ఇంత జరిగినా జరుగుతున్నా.. కొండా సురేఖకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి సహా ఆయన కేబినెట్ సహచరులెవరూ పెద్దగా స్పందించలేదు. మంత్రిగా ఉన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆమె వ్యక్తిగత హోదాలో చేశారంటూ కాంగ్రెస్ సర్కార్ తప్పించుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవు. తన వ్యాఖ్యలకు కొండా సురేఖ మాత్రమే కాకుండా క్యాబినెట్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం సద్దుమణగాలంటే, కొండా సురేఖ వ్యాఖ్యల ప్రభావం కాంగ్రెస్ సర్కార్ పై పడకుండా ఉండాలంటే ఆమెపై చర్యలు తీసుకోవడమే మార్గమని పార్టీ హైకమాండ్ భావిస్తోంది.  టీపీసీసీ చీఫ్ రంగంలోకి దిగి వివాదానికి ముగింపు పలకడానికి చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించినట్లు కనిపించదు. కొండా సురేఖ ఒక  అడుగు తగ్గి సమంతకు క్షమాపణలు చెప్పడమే కాకుండా, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినా ఆమెపై వెల్లువెత్తుతున్న విమర్శల హోరు ఇసుమంతైనా తగ్గలేదు. టాలీవుడ్ మొత్తం కొండా సురేఖ వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించింది.  ఇక విషయాన్ని హైకమాండ్ కూడా సీరియస్ గా తీసుకుని ఆమె వివరణ కోరడంతో సురేఖపై వేటు తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఆమె వివరణ ఇవ్వడంతో ఇక చర్యలే తరువాయి అని కాంగ్రెస్ వర్గాలు కూడా అంటున్నాయి. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. అయితే కేబినెట్ నుంచి మాత్రం కొండా సురేఖకు ఉద్వాసన పలికే అవకాశాలున్నాయని అంటున్నారు. కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడం ద్వారా ఈ వివాదం ప్రభావం ప్రభుత్వంపై పడకుండా నివారించినట్లౌతుందనీ, ఆ తరువాత ఈ విషయంలో కొండా సురేఖ తన వ్యక్తిగత హోదాలో పోరాడాల్సి ఉంటుందని పరివీలకులు విశ్లేషిస్తున్నారు.   
Publish Date: Oct 5, 2024 3:38PM

హీరో చంపిన వ్యక్తి దయ్యంలా మారాడా?

రేణుకాస్వామి అనే తన అభిమానిని హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ కొంతకాలంగా విచారణ ఖైదీగా బళ్లారి జైలులో వున్నారు. దర్శన్ గత కొన్నిరోజులుగా రాత్రుళ్ళు నిద్రపోవడం లేదని తెలుస్తోంది. తాను చంపిన రేణుకాస్వామి ఆత్మ తనని వెంటాడుతోందని, కలలోకి వచ్చి భయపెడుతోందని, అందువల్ల భయంతో తనకు నిద్ర పట్టడం లేదని దర్శన్ జైలు అధికారులకు చెబుతున్నారని తెలుస్తోంది. తాను ఒంటరిగా ఉండలేకపోతున్నానని, అందువల్ల తనను బెంగళూరు జైలుకి తరలించాలని కోరినట్టు సమాచారం. అర్ధరాత్రి సమయంలో దర్శన్ గట్టిగా కేకలు వేస్తున్నాడని తోటి ఖైదీలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా దర్శన్ ఆడుతున్న నాటకమని కొందరు అంటున్నారు. బెంగళూరు జైలుకు మారడం కోసమే దర్శన్ ఇవన్నీ చెబుతున్నారని అంటున్నారు. ఒకవేళ రేణుకాస్వామి దయ్యంగా మారినట్టయితే బెంగళూరు జైలుకు రాడా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. 
Publish Date: Oct 5, 2024 3:25PM

పవన్ కళ్యాణ్‌ VS తమిళ్ సాంబార్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత  పవన్ కల్యాణ్‌పై తమిళనాడులోని మధురైలో కేసు నమోదైంది.  తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో పవన్  తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిథి మారన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ  ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు మధురైలో కేసు నమోదైంది. వారాహి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని  ఎవరూ నిర్మూలించలేరని, అలా అనుకున్నవారే తుడిచిపెట్టుకుపోతారని వ్యాఖ్యానించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గతంలో  సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి,  సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని అన్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో వంజినాథన్ అనే న్యాయవాది పవన్ కల్యాణ్‌పై మధురై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.  తిరుపతి లడ్డూ వివాదానికి, ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదని, అయినా పవన్ విమర్శలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
Publish Date: Oct 5, 2024 2:41PM