వీళ్ళు ప్రత్యేక వంటలోళ్లండి!!

ఇంకెవరూ వంటలు చేసేవాళ్లే. అబ్బాబ్బా ఏమి చెప్తిరి ఆ విషయం మాకు తెలియదా అనుకుంటారా??అసలు అనుకోవద్దు. ప్రతి ఇంట్లో వంటలు చేసేవాళ్ళు ఉంటారు ఆ మాత్రానా వంటలోళ్లం అయిపోతామా?? కాదు కదా!! మరి ఈ వంటలోళ్ళ గురించి కథ ఏమిటి అంటే…..


ప్రతి ఇంట్లో సాపాటు తొందరగా కాకపోతేనో, ఏదైనా సమస్య వల్ల కుదరకపోతేనో అందరూ పడే పాట్లు ఏమి లేవు. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ప్రతి ఊర్లో ఎన్నో హోటల్స్ మరెన్నో రెస్టారెంట్స్, మరెన్నో చిన్న చిన్న బడ్డి కొట్టు లాంటివి, వాటికి మించి తోపుడు బండ్ల పైన అమ్మే స్ట్రీట్ ఫుడ్ కింగ్స్ ఎక్కువ. ఎక్కువ మంది బతుకు తెరువు కోసం తోపుడు బండ్ల మీద టీ లు అమ్ముతూ క్రమంగా టిఫిన్ సెంటర్లు, తరువాత హోటల్స్ ఇట్లా మెల్లిగా ఎదిగినవారే. వీళ్ళలో చాలామటుకు జీవితం కోసం అలా మారినవారే, పైగా చిన్న పెట్టుబడితో కాసింత రుచిగా వండి మర్యాదగా వడ్డిస్తూ లాభాలు ఆర్జిస్తూ జీవితాలను కాసింత ఒడిదుడుకుల వల్యం నుండి బయటకు లాగి భరోసాను ఇచ్చుకున్న వాళ్లే. అందులోనూ తిండి లేకపోతే మనిషి పని ముందుకు సాగదు. కారణాలు ఏవైనా హోటల్స్ లో తినేవారి సంఖ్య ఎక్కువే. అయితే ఏరి కోరి ఇందులోకి వచ్చేవాళ్ళు ఉన్నారు.  

ఎందులోకి అనే అనుమానం వచ్చిందా??

అదే అదే వంట చేయడమనే విద్యలోకి. ఏ ఇంట్లో అయినా మగవాళ్ళు వంటింట్లో దూరి ఏదో ఒకటి వండుతుంటే,  హవ్వా!! మగాడు వంటింట్లో వంట చేస్తుంటే ఆ ఇంటి ఆడవాళ్లు బాగా తింటున్నారా అని కొందరు అంటారు. కానీ వంట చేయడం అనేది కూడా ఒక వృత్తిలో బాగమైపోయింది ఇప్పుడు అని చెబితే దానికి మాత్రం ఓహో అని గమ్మునైపోతారు. 

స్టైలిష్ గా చెఫ్స్…

ఎప్పుడైనా పెద్ద రెస్టారెంట్లకు వెళ్తే అక్కడ వంట చేసేవాళ్ళు ఉంటారు.  వాళ్ళను వంటోళ్లు అని కొట్టి పడేయకూడదు. వాళ్లలో ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో ఎక్కువగా మగవాళ్ళు ఉండటం విశేషం. 

ఏమిటా ప్రత్యేకత?? 

కళాత్మకత. కాసింత కళాపోషన ఉండాలోయ్ అన్నట్టు వీళ్ళలో ఆ కళాపోషణ పాళ్లు అధికమనే చెప్పాలి. చేసే వంట నుండి, దాన్ని చేసే విధానం, కురముక్కలు కోసే పద్దతి, వంటకు తగ్గట్టు దాన్ని ఎలా ఎంత మంట మీద వేయించాలి, లేదా ఉడికించాలి వంటివి మాత్రమే కాకుండా ఆఖరికి వంట మొత్తం అయ్యాక దాన్ని ప్లేట్ లో పెట్టి దానికి గార్నిష్(అలంకరణ) చేయడం వరకు ప్రతి చోట వాళ్ళ మార్క్ కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ వాళ్ళు ఎదో మొక్కుబడిగా చేసేయడం లేదా వచ్చినట్టు చేయడం కాకుండా లక్షలు పోసి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లు చేసి కష్టపడి, ఇష్టపడి నేర్చుకొని వండటం మీద వాళ్లకున్న ఇష్టాన్నే వాళ్ళ వృత్తిగా మార్చుకునావాళ్ళు వాళ్ళు. అదే సాదారణంగా వంట చేసేవాళ్లకు, చెఫ్స్ కు ఉన్న తేడా!! ప్రయోగాలు, విభిన్న రుచులు, విదేశీ వంటకాలతో  కనువిందు చేస్తూ అందరికి విందు అందించే ఈ చెఫ్స్ పాకాశాలలో ఇప్పుడు కింగ్స్ గా గరిటలతోనూ ఘుబాళింపులతోనూ లీనపోయి ఉన్నారు. మీకూ వండటం అంటే ఇష్టమైతే దాన్నే వృత్తిగా ఎంచుకోవాలని ఉంటే చెఫ్స్ అయిపోండి. 
                                                                                                                                                                                                                                                                                        

                                                                                                                             ◆ వెంకటేష్ పువ్వాడ

Related Segment News