ఇంకొంచెం సంతోషంగా జీవిద్దాం 

 జీవించడానికి, బతకడానికి మధ్య ఒక సన్నని గీతను చూపెడుతుంటారు కొందరు. అయితే సాధారణ జీవితాల్లో బంధాలు, భాధ్యతలు, సర్దుకుపోవడాలు త్యాగాలు, వీటన్నిటికీ మించి  కాలం తో పాటు అన్నిటికి అలవాటు పడుతూ కుటుంబంలో అందరితో సమన్వయంగా ఉంటూ ఇలా కొనసాగడం ఎక్కువ మంది చేసే పని. బహుశా ఇట్లా చేసే పనుల్లో ఇష్టం, తృప్తి కంటే బాధ్యత కాబట్టి చేయాలి కాబట్టి చేస్తున్నాం అనే మెంటాలిటీనే ఎక్కువగా ఉంటుంది.

కానీ ఒక విషయం. ఇలా చేసే పని వల్ల సంతోషం ఉంటుందా??

యాంత్రికంగా, కృత్రిమత్వంగా చేసే పనికి, ఇష్టంగా చేసే పనికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆ రెండిటి మీదనే మనిషిలో తృప్తి తాలూకూ స్పందనలు కూడా ఉంటాయి. ఈ విషయాన్ని బహుశా చాలామంది గమనించరు. అలా గమనించకపోవడం అనేది కూడా ఆ యాంత్రికం మరియు కృత్రిమత్వంలో భాగమే. అయితే కొందరు మాత్రం చేసే పనిలో కూడా ఎంతో తృప్తిని చవిచూడగలుగుతారు కారణం ఏమిటి అని ప్రశ్న వస్తే కొందరు చెప్పే సమాధానం. బహుశా నచ్చిన పని కావచ్చు అందుకే అంత సంతోషం అనేస్తారు. 

కానీ అసలు నచ్చిన పని ఏమిటి?? నచ్చని పని ఏమిటి??

మనిషికి, సంతోషానికి, ఇష్టానికి మధ్య సంబంధం ఏమిటి?? ఇవన్నీ ఆలోచించాల్సి వస్తే మొదట మనసును ప్రభావితం చేసిన పరిస్థితులు, చేతనైనది, చేతకానిది, లేదా నైపుణ్యం సాధించింది ఇలా ఎన్నో పరిగణలోకి వస్తాయి. కానీ ఏ పనిని అయినా ఒక అవగాహనతో, ఒక ప్రణాళికతో చేయాలని అనుకుంటే మాత్రం తప్పని సరిగా ఆ పనిలో తృప్తిని పొందగలం. వాస్తవాన్ని స్వీకరించి, కాలాన్ని ప్రేమించాలి వాస్తవం ఏది అనేది తెలిసినప్పుడు దాన్ని నిజాయితీగా స్వీకరించాలి. ఎప్పుడూ అది కాదు, అది బాగలేదు, అది నాకు సంబంధించినది కాదు వంటి మభ్యపెట్టుకునే ఆలోచనల్లో ఉండకూడదు. వాస్తవాన్ని ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టు స్వీకరిస్తామో అప్పుడు కాలాన్ని కూడా ప్రేమించగలుగుతాము. ఇదంతా కూడా కొన్ని భ్రమలు, కొన్ని కల్పనలను బుర్రలో నుండి వదిలేసి స్పష్టమైన కోణంలో ఆలోచించడం వల్ల కలిగేది.  ఒక వస్తువును చూడాలి అంటే కాగితాన్ని అడ్డు పెట్టుకుంటే ఎలాగైతే మసకగా కనిపిస్తుందో అలాగే కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నియమాలు, షరతులు, మనసును కట్టిపడేసే పద్ధతులు అన్నిటి మధ్య చూస్తే వాస్తవం అనేది స్పష్టంగా కనిపించదు, అర్థం కాదు. అలా కాకుండా కేవలం విషయాన్ని, దాని తాలూకూ కారణాలను మాత్రమే చూస్తూ, విశేక్షించుకుంటే వాస్తవం తొందరగా బోధపడుతుంది. ఇక కాలాన్ని ప్రేమించడమంటే అన్ని దశలను కూడా ప్రేమించడం. ఇక్కడ మనిషి పరిపక్వతను సూచించేది ఏదైనా ఉందంటే అది కచ్చితమై కాలం. అదే వర్తమానం. పరిపక్వత కలిగిన మనిషి గతాన్ని గురించి బాధపడడు, భవిష్యత్తు గురించి ఖంగారు పడడు. కేవలం వర్తమానాన్ని ఎంత సమర్థవంతంగా ఎంత సంపూర్ణంగా వినియోగించుకుంటున్నాం. మన పనులను వర్తమానంలో ఎంత బాగా చేస్తున్నాం అనే విషయం మీదనే శ్రద్ధ పెడతాడు. కాబట్టి ఇక్కడ తెలిసొచ్చేది ఏమిటంటే మనం సాధారణంగా ఏ పని చేసిన కూడా దాన్ని మనసుకు తీసుకునే విధానంలోనే సంతోషం అనేది ఆధారపడి ఉంటుంది. అందుకనే చేసే పని ఏదైనా దాన్ని ఇష్టంతో చేయగలిగితే మరింత సంతోషంగా ఉండవచ్చు. ఆ పాజిటివ్ కోణమే మీ జీవితాన్ని కూడా సంతోషంగా ఉంచుతుంది.
                                                                                                                                                                                                                                                                                           

 ◆ వెంకటేష్ పువ్వాడ