వెలుగులోకి టీఆర్ఎస్ నేతల ఆగడాలు.. కబ్జాలు, దాడులు!!

తెలంగాణలో అధికార పార్టీ నేతలు కొందరు కబ్జాలకు తెగబడుతున్నారా? ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారా?.. తాజాగా వెలుగులోకి వచ్చిన రెండు ఘటనలు అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయి. అధికార పార్టీ మాది అంటూ కొందరు స్థానిక నేతలు సామాన్యులపై ఎలా దౌర్జన్యం చేస్తున్నారో తెలియజేస్తున్నాయి.

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో మంత్రి కేటీఆర్ కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు వ‌చ్చిన మంత్రి కేటీఆర్ .. వీర‌న్న పేట్ లో 660 డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను ప్రారంభించి, అక్క‌డి నుండి బ‌య‌లుదేరుతున్న స‌మ‌యంలో ఆయన కాన్వాయ్ ను ఓ కుటుంబం అడ్డుకుంది. త‌మ భూమిని కొందరు టీఆర్ఎస్ నేత‌లు క‌బ్జా చేసి బెదిరిస్తున్నార‌ని, ఏ అధికారి వద్దకు వెళ్లినా న్యాయం జరగడం లేదని, త‌మ‌కు న్యాయం చేయాల‌ని వారు డిమాండ్ చేశారు. అయితే బాధిత కుటుంబం మంత్రిని క‌ల‌వ‌కుండానే స్థానిక పోలీసులు ఆ కుటుంబాన్ని ప‌క్క‌కు ఈడ్చి ప‌డేశారు. పోలీసుల ప్ర‌వ‌ర్త‌న‌పై స్థానిక ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. రోజు రోజుకు పెరిగిపోతున్న స్థానిక టీఆర్ఎస్ నేత‌ల ఆగ‌డాల‌కు చెక్ పెట్ట‌క‌పోతే ఇంకెంత మంది భూములు క‌బ్జా చేస్తారోనంటూ మండిప‌డుతున్నారు.

అధికార పార్టీ కార్పొరేటర్ భూ వివాదంలో తలదూర్చడమే కాకుండా.. ప్రశ్నించినందుకు తన భర్తపై ఆయన అనుచరులతో కలిసి దాడి చేసారని బానోదయా అనే మహిళ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. మేడ్చల్ జిల్లా, బోడుప్పల్, ద్వారకా నగర్ లో ఆరు సంవత్సరాల క్రితం బ్యాంక్ లో లోను తీసుకొని కొన్న ఇల్లులో తమకు వాటా ఉందని స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీధర్ గౌడ్ దౌర్జనానికి పాల్పడ్డాడని కమిషన్ కు వివరించింది. ఇంటిమీదికి వచ్చి తన భర్త పూరేందర్ పై కార్పొరేటర్ తన అనుచరులతో కలిసి విచక్షణారహితంగా దాడి చేయయంతో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని బాధిత మహిళ కమిషన్ కు వివరించింది. ఈ ఘటనపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ.. కార్పొరేటర్ తో కుమ్మకైన పోలీసులు తిరిగి తమపైనే అక్రమంగా కేసు పెట్టి వేదిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దాడి జరిగి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికి కార్పొరేటర్, ఆయన అనుచరులపై కేస్ నమోదు చేయలేదని, అరెస్ట్ చేయలేదని ఆమె పేర్కొన్నారు. కార్పొరేటర్ శ్రీధర్ గౌడ్ తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించడంతో పాటు చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన మేడిపల్లి పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు బానోదయా హెచ్చార్సీని వేడుకుంది.

రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య సాక్షాత్తు మేయర్ పైన కూడా కబ్జా ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే అధికార పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇకనైనా పార్టీ అధినాయకత్వం స్థానిక నేతలపై ఓ కన్నేసి సామాన్యులకు అండగా నిలబడితే మంచిది.